ఇవాళ ఉదయం వచ్చిన భూకంపం ధాటికి టిబెట్-నేపాల్ సరిహద్దులో 95 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 130 మందికి పైగా గాయపడ్డారు. వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు చైనా వార్తా సంస్థ జిన్హువా ప్రకటించింది. సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారుల్ని ఆదేశించారు. ఉదయం 6:35 గంటలకు మొదలై వరుసగా మూడు భూకంపాలు(Earthquakes) రావడంతో పెద్దయెత్తున ప్రాణనష్టం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత తొలుత 4.7(Magnitude)గా, రెండోసారి 4.9గా నమోదైంది. ఇక మూడోసారి భారీ స్థాయిలో 7.1 తీవ్రత రావడంతో ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బిహార్, పశ్చిమబెంగాల్ తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ లోని లొబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(USGS) ప్రకటించింది.