నేపాల్ కేంద్రంగా వచ్చిన భారీ భూకంపం మరోసారి గడగడలాడించింది. దీని ధాటికి టిబెట్-నేపాల్ సరిహద్దు(Border)ల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. భారీస్థాయిలో భవనాలు కూలిపోగా.. వరుసగా ఒకదాని వెంట ఒకటి మూడు భూకంపాలు(Earthquakes) రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. తొలుత రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రత(Magnitude)తో ప్రకంపనలు రాగా, రెండోసారి 4.9గా నమోదైంది. ఇక మూడోసారి భారీ స్థాయిలో 7.1 తీవ్రతతో రావడంతో ఆందోళన మొదలైంది. నేపాల్ లో భూకంప కేంద్రం ఉండగా బిహార్, పశ్చిమబెంగాల్ తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి.
నేపాల్ లోని లొబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(USGS) ప్రకటించింది. లొబుచే ప్రాంతం నేపాల్ రాజధాని ఖాట్మండుకు తూర్పు దిక్కులో ఉండగా, టిబెట్ రీజియన్ ఖుంబు గ్లేసియర్ లోని 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. అటు చైనా భూకంప మానిటరింగ్ ఏజన్సీ మాత్రం ఈ భూకంపం తీవ్రత 6.8గా ఉన్నట్లు తెలియజేసింది. నేపాల్, భారత్, చైనా, బంగ్లాదేశ్, భూటాన్ వంటి సమీప దేశాల్లో ప్రకంపనలు వచ్చాయి.