భారతదేశంపై ఎప్పుడూ అక్కసు గక్కే చైనా.. అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)ను అడ్డం పెట్టుకుని బెదిరించాలని చూస్తుంటుంది. ఆ రాష్ట్రం తమ భూభాగమంటూ పలు ప్రాంతాలకు పేర్లు పెడుతుంటుంది. దీనిపై భారత్ సహా ప్రపంచ దేశాలు అడ్డు చెప్పినా ఏ మాత్రం పట్టించుకోదు జిత్తులమారి డ్రాగన్ దేశం. అందుకే ఇప్పుడు భారత్ సైతం గేరు మార్చింది. రివర్స్ గేర్ తో దెబ్బకు దెబ్బ తీసి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నది.
ఎలా అంటే…
సర్వ స్వతంత్రం(Autonomous)గా వ్యవహరించే చైనాలోని టిబెట్ పరిసర ప్రాంతాలకు భారత్ తమ పేర్లు పెట్టడానికి సిద్ధమైంది. అక్కడ 24 ప్రాంతాలకు పేర్లు పెట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక(Action Plan) సిద్ధం చేసింది. ఈ పేర్లు చారిత్రక ప్రాశస్త్యం(Historical Research) గలవి లేదంటే స్థానికంగా అనాది(Ancient)గా వాడుకలో ఉన్నవాటిని సెలెక్ట్ చేసే పనిలో ఉంది. ఇందుకోసం కోల్ కతాలోని బ్రిటిష్ కాలం నాటి ‘ఏషియాటిక్ సొసైటీ’ సహకారం తీసుకుంటున్నది.
2017 నుంచే…
అరుణాచల్ లోని ప్రాంతాలకు 2017 నుంచే పేర్లు పెట్టడం ప్రారంభించింది జిన్ పింగ్ సర్కారు. సరిహద్దు అయిన ఎల్ఏసీ(Line Of Actual Control) పొడవునా మొన్నటి మార్చిలో 30 ప్రదేశాలకు పేర్లు పెట్టుకుంది. ఇందులో 12 పర్వతాలు, 11 నివాస ప్రాంతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు ఉన్నాయి. 2017లో ఆరు, 2021లో 15, 2023లో 11 ప్లేస్ లకు పేర్లు పెట్టింది చైనా.
మోదీ టూర్…
ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రంలో 2024 మార్చిలో పర్యటించడంతోపాటు 13,000 అడుగుల ఎత్తులో నిర్మించి జాతికి అంకితం చేసిన ‘సేలా టన్నెల్’ నిర్మాణాన్ని చైనా తప్పుబట్టింది. భారత్ లో అరుణాచల్ అంతర్భాగమంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ అదే నెల 23న దీటుగా బదులిచ్చారు. ఆ దేశాన్ని దెబ్బకు దెబ్బ తీయాలన్న లక్ష్యంతో రివర్స్ గేర్ కు మనదేశం సిద్ధమైంది. టిబెట్లో పెట్టదలచిన పేర్లపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ప్రధాని చర్చించిన తర్వాత కొలిక్కి వచ్చే అవకాశముందని విదేశాంగ వర్గాలు అంటున్నట్లు జాతీయ పత్రిక ప్రచురించింది.