ఫ్రెండ్ షిప్ పేరుతో పాకిస్థాన్ వెళ్లిన వివాహిత.. చివరకు ప్రియుణ్ని అక్కడే మళ్లీ పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ(34) జైపూర్ టూర్ వెళ్తున్నానని చెప్పి భర్తను నమ్మించింది. పాక్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అప్పర్ దిర్ జిల్లాలోని స్థానిక కోర్టులో ఆమె నస్రుల్లా(29)ను వివాహమాడింది. ఈ విషయాన్ని అక్కడి DIG తెలిపారు. పెళ్లికి ముందు అంజూ మతం మారిందని, ఫాతిమాగా పేరు మార్చుకుని ఎవరి బలవంతం లేకుండా నిఖాకు అంగీకరిస్తున్నట్లు ఇద్దరూ సంతకాలు చేశారన్నారు. బంధువులు, లాయర్లు, న్యాయమూర్తుల ఎదుట వివాహం ఘనంగా జరిగిందని చెప్పారు. పెళ్లికి ఒకరోజు ముందు సోమవారం నాడు ఈ జంట.. అక్కడి టూరిస్ట్ ప్లేస్ ల్లో విహరిస్తూ చేతిలో చేయి వేస్తూ ఎంజాయ్ చేసింది. తాను ప్రియుణ్ని వెతుక్కుంటూ పాక్ కు వచ్చానని, అక్కడే ఉండిపోతానని ఆమె స్పష్టం చేసింది.
కుటుంబం సైన్యానికి… ఆమె పాక్ కు
రాజస్థాన్ అల్వార్ లోని భివాండి ప్రాంతంలో ఉంటున్న అంజూకు భర్తతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల నాడు ఫేస్ బుక్ లో ఆ లేడీకి పాకిస్థాన్ వాసితో పరిచయం ఏర్పడింది. టూర్ కోసం జైపూర్ వెళ్తున్నానని చెప్పి జులై 20న ఆ వివాహిత ఇంట్లో నుంచి బయల్దేరింది. భర్త కూడా ఆమె జైపూరే వెళ్తుందని అనుకున్నాడు. కానీ ఆమె అడుగుపెట్టింది వాఘా బోర్డర్ ద్వారా పాకిస్థాన్ లో. రాజస్థాన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ కోసం రావడంతోనే అసలు విషయం తెలిసింది భర్త అరవింద్ కుమార్ కు. విశేషమేంటంటే ఆమె కుటుంబానికి BSFతో అనుబంధం ఉంది. ఆమె తాత గతంలో టేకాన్ పూర్ అకాడమీలో పనిచేయగా.. అంజూ అంకుల్ సైతం ప్రస్తుతం అదే అకాడమీలో సైనికుడిగా ఉన్నారు. అంజూ పాక్ కు వెళ్లడంతో మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లా ద్వార్ఫ్ గ్రామంలోని వారి కుటుంబ కదలికలపై నిఘా వర్గాలు కన్నేసి ఉంచాయి. ఆ ఊరికి చెందిన కొంతమంది ఇప్పటికీ BSFతోపాటు సైన్యంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు.
మా దృష్టిలో చనిపోయినట్లే
మా దృష్టిలో అంజూ చనిపోయినట్లేనని ఆమె తండ్రి గయ ప్రసాద్ థామస్ స్పష్టం చేశారు. అంజూ ఈ పనిచేసి ఇద్దరు పిల్లలైన 15 సంవత్సరాల కూతురు, ఆరేళ్ల కుమారుడి ఫ్యూచర్ ను నాశనం చేసిందన్నారు.