హమాస్ దాడుల అనంతరం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశాల మధ్య యుద్ధాని(War)కి దారితీస్తున్నాయి. పాలస్తీనాపై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్.. హమాస్ కు సహకరిస్తున్న టాప్ కమాండర్లను మట్టుబెడుతున్నది. ఇరాన్(Iran) నుంచే గాజా(Gaza)కు సహకారం అందుతుందని గుర్తించిన ఇజ్రాయెల్(Israel) దళాలు.. ఆ దేశంపై తరచూ దాడికి దిగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోర్చుగీస్ జెండా(Flag)తో తమ జలాల్లోకి ప్రవేశించిన నౌకను ఇరాన్ చుట్టుముట్టింది.
MSC ఎరీస్…
పోర్చుగీస్ పతాకంతో ఇరాన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఎం.ఎస్.సి.ఎరీస్ అనే షిప్ ను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్(Revolutionary Guards) అదుపులోకి తీసుకున్నారు. హెలికాప్టర్ ద్వారా నౌక వద్దకు చేరుకుని అందులో ఉన్నవారిని బంధించారు. దీనికి ఇజ్రాయెల్ తో సంబంధాలున్నాయని ఇరాన్ భావించింది. ఇందులో మొత్తం 25 మంది ఉండగా, 17 మంది భారతీయ సిబ్బంది పనిచేస్తున్నారు.
ఇజ్రాయెల్ లింక్డ్ షిప్ ను సీజ్ చేసినట్లు టెహ్రాన్ నాయకత్వం ప్రకటించింది. అయితే భారతీయుల్ని బంధించిన ఘటనపై ఢిల్లీ-టెహ్రాన్ మధ్య మంతనాలు సాగుతున్నాయి. మన దేశస్థుల్ని విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులు ఇరాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.