జో బైడెన్ పోటీ నుంచి తప్పుకున్న దృష్ట్యా డెమొక్రాట్ల(Democrats)లో రెండోస్థానంలో ఉన్న ఇండో-అమెరికన్ కమలా హారిస్ కు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే బైడెన్ ఆమెకు మద్దతు(Support) ప్రకటించగా ఆ పార్టీలో ఎక్కువ మంది కమలహారిస్ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారు.
అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలకు మరో 106 రోజులే మిగిలి ఉంది. నవంబరు 5న ప్రెసిడెంట్ ఎలక్షన్లు మొదలవుతాయి. 81 ఏళ్ల బైడన్ తప్పుకోవడంతో 78 సంవత్సరాల ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న అత్యధిక వయసు గల వ్యక్తిగా నిలిచారు. మరోవైపు ఆయన ప్రత్యర్థి 59 ఏళ్ల కమల.. పోటీలో పాల్గొంటున్న చిన్న వయస్కురాలుగా నిలవబోతున్నారు.
తమిళ జీవశాస్త్రవేత్త శ్యామా గోపాలన్, జమైకా-అమెరికన్ అయిన ప్రొ.డొనాల్డ్ జె.హారిస్ దంపతులకు కాలిఫోర్నియాలో కమలాదేవి హారిస్ జన్మించారు. తల్లిదండ్రుల విడాకుల తర్వాత తన తల్లి, సోదరితో కలిసి జీవించారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, న్యాయశాస్త్రాల్లో పట్టాలు పొందారు. 1990లో బార్ అసోసియేషన్ మెంబర్ గా, డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని ప్రారంభించారు.
2003లో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా.. 2010, 2014లో అటార్నీ జనరల్ గా ఎన్నికయ్యారు. 2017లో జూనియర్ US సెనెటర్ గా, 2021లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.