రష్యాలో భీకర మారణహోమం చోటుచేసుకుంది. ఆటోమేటిక్ ఆయుధాలతో(Weapons) విచక్షణారహితం(Mercilessly)గా జరిపిన కాల్పుల్లో 60 మంది ప్రాణాలు కోల్పోగా, 145 మంది గాయపడ్డారు. గత కొన్ని దశాబ్దాల్లో రష్యాపై జరిగిన అతి పెద్ద దాడి ఇది. ఇస్లామిక్ స్టేట్(ISIS-K)కు చెందిన ఉగ్రవాదుల ఘాతుకమేనని నిర్ధారించారు. సంగీత కచేరి జరుగుతున్న సమయంలో జరిపిన దాడిలో ప్రాణనష్టం భారీగా ఉంది.
ISIS-K అంటే ఏమిటి…?
ISIS-K అంటే ఇస్లామిట్ స్టేట్ ఖొరాసన్ అని అర్థం. తూర్పు అఫ్గానిస్థాన్(Eastern Afghan)లో 2014లో పురుడు పోసుకున్న మిలిటెంట్ సంస్థ ఇది. ఇరాన్, తుర్క్ మెనిస్థాన్, అఫ్గానిస్థాన్ లో పాతుకుపోయిన ఈ గ్రూప్… ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించేలా ప్రణాళికలు వేస్తుంటుంది. అఫ్గాన్ లో 2018లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక వీరి దూకుడు ఎక్కువైపోయింది. ఇక 2021లో అమెరికా తన బలగాల్ని తాలిబన్ గడ్డపై నుంచి వెనక్కు తీసుకోవడంతో ఈ గ్రూప్ కు అడ్డే లేకుండా పోయింది.
ఎక్కడెక్కడ దాడులు…
అఫ్గాన్ సమీప ప్రాంతాలే లక్ష్యంగా ISIS-K దాడులకు వ్యూహరచన చేస్తుంటుంది. మసీదులతోపాటు కాబూల్ లోని రష్యా ఎంబసీపైనా దాడులకు దిగింది. 2021లో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై దాడికి దిగి కల్లోలం సృష్టించింది. సాధారణ పౌరులు, మిలిటరీయే లక్ష్యంగా సాగిస్తున్న దాడులతో భయానక వాతావరణం సృష్టించాలనేది ఆ సంస్థ లక్ష్యం. అందులో భాగంగానే రష్యా సమీపంలోని కారకస్ సిటీ హాల్ లో జరిపిన తాజా దాడిగా అమెరికా స్పష్టం చేసింది.
రష్యాపై ఎందుకు…
రష్యా, దాని అధ్యక్షుడు పుతిన్ పై ఆగ్రహంతో ఉన్న ISIS-K ఆ దేశంపై దాడులకు ప్లాన్ చేస్తుంటుంది. మధ్య ప్రాచ్యంతోపాటు ముఖ్యంగా సిరియాలో సాగుతున్న మారణకాండపై గుర్రుగా ఉంది. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సద్ కు అనుకూలంగా క్రెమ్లిన్ సైన్యాలను దించి ISISతోపాటు అతివాద గ్రూపులను ఏరివేయడంపై ఈ మిలిటెంట్ గ్రూప్.. రష్యాపై దండయాత్ర చేయాలని నిర్ణయించింది. రష్యా మద్దతుతోనే సిరియా ప్రెసిడెంట్ తమను ఏరివేస్తున్నారన్న కోపంతో రష్యాపై ISIS-K దాడులు చేస్తున్నది.
మధ్య ఆసియా ప్రాంతంలో మిలిటెంట్ గ్రూపులను దించుతున్న ISIS-K.. రష్యా గడ్డపై దాడులకు దిగడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముస్లింలకు క్రెమ్లిన్ నాయకత్వం వ్యతిరేకమంటూ కాల్పులు, బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నది. ఇలాంటి దాడులు రష్యాలో మరిన్ని జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అగ్రరాజ్యం(United States) పుతిన్ ను హెచ్చరించింది. జనం ఎక్కువగా గుమికూడే(Gathering) మాస్కోలోని ప్రాంతాల్లో ఇంకా దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరిక పంపింది.