ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నెలకొన్న పరస్పర దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్(Israel)లోకి ప్రవేశించిన హమాస్ తీవ్రవాదులు శనివారం నాడు అల్లకల్లోలం సృష్టించారు. గత కొన్ని దశాబ్దాల్లో(Decades) చూడనటువంటి రీతిలో ప్రాణ నష్టం కలిగించారు. అటు గాజా సిటీ నుంచి రాకెట్లతో ఇజ్రాయెల్ సిటీలపై మెరుపుదాడులకు తెగబడ్డారు. తొలుత హమాస్ సంస్థ జరిపిన దాడితో ఇజ్రాయెల్ లో 100 మంది మృత్యువాత పడగా, 500 మంది దాకా గాయపడ్డట్లు ఆ దేశ న్యూస్ పేపర్ ‘హారెట్జ్’ తెలిపింది. దేశంలో అలర్ట్ ప్రకటించి పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగడంతో హమాస్ మిలిటెంట్లు సహా 200 మందికి పైగా హతమయ్యారు. ఈ రాకెట్ దాడుల్లో వందలాది మంది గాయాల పాలయ్యారు. తమ దాడిని హమాస్ సమర్థించుకోగా ఇది గ్రేట్ విక్టరీ అంటూ ఆ సంస్థ చీఫ్ హనియే ప్రకటించుకున్నారు. అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ ఎప్పుడూ రక్షణ కల్పించబోదు అని అన్నారు.
ప్రపంచ దేశాల మద్దతు, ఆందోళన
యూదు దేశంపై ఉగ్రవాదులు జరిపిన దాడి పట్ల ఐక్యరాజ్యసమితి(United Nations) ఆవేదన వ్యక్తం చేస్తూ ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించింది. దాడుల్ని UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఖండించడమే కాకుండా దౌత్యపరమైన చర్యలపై దృష్టిసారించారని ఐరాస స్పోక్స్ పర్సన్ స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ గ్రూప్ జరిపిన ఆకస్మిక దాడిపై చర్చించేందుకు ఆదివారం నాడు ఐరాస భద్రతా మండలి సమావేశమవుతున్నది. ఇజ్రాయెల్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా ప్రకటించింది. నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన జో బైడెన్.. అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
టెల్ అవీవ్ కు విమానాలు క్యాన్సిల్
ఇజ్రాయెల్ పరిస్థితుల దృష్ట్యా ఆ దేశ ప్రధాన నగరమైన టెల్ అవీవ్ కు రాకపోకలు సాగించాల్సిన ఎయిరిండియా విమానాల్ని ప్రభుత్వం రద్దు చేసింది. భద్రతా కారణాల రీత్యా ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.