దేశాల అధినేతలు భేటీ అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, హత్తుకోవడం చేస్తుంటారు. కొంతమంది తమ దేశ సంస్కృతి ఆధారంగా విదేశీయులకు స్వాగతం పలుకుతుంటారు. ఇక రెండు చేతులతో నమస్కారం చేయడం మన భారతీయ సంస్కృతి(Indian Culture). ఈ పద్ధతికి ఎంతోమంది ఫిదా అయి దాన్నే ఆచరిస్తున్నవారూ ఉన్నారు. మన కల్చర్ ను మనం పాటించకున్నా ఇతరులు మాత్రం ఫాలో అవుతూనే ఉన్నారు. అలాంటి వారిలో చేరారు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని(Giorgia Melony).
ఎవరితో…
ప్రధాని మోదీ.. ఇతర భారతీయ లీడర్లెవరైనా వెళ్తే ఆమె నమస్కారం పెట్టారనుకోవచ్చు. కానీ భారతీయతతో సంబంధం లేని వ్యక్తులకు ఇటలీ ప్రధాని రెండు చేతులు జోడించి నమస్కరించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ ను నమస్కారంతో స్వాగతం పలికిన మెలోని.. జర్మనీ ఛాన్సలర్(Chancellor) ఒలాఫ్ షోల్జ్ కూ అదే రీతిలో వెల్ కమ్ చెప్పారు.
ఎందుకలా…
ఇటలీ ప్రధాని 2023లో రెండు సార్లు భారత్ లో పర్యటించారు. ఇండియా-ఇటలీ ద్వైపాక్షిక(Bilateral) సంబంధాలు, ఇండో-పసిఫిక్ పై విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. అప్పుడే ఆమె మన సంస్కృతికి ఫిదా అయినట్లున్నారు. అందుకే తమ దేశంలోనూ విదేశాల అధినేతలకు భారతీయ సంస్కృతిలో స్వాగతం చెబుతున్నారు.
ఆ దేశాలివే…
USA, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ జీ-7 సభ్య దేశాలు. ఈ 13 నుంచి 15 వరకు 3 రోజుల పాటు సమావేశాలున్నాయి. ఆర్థికవృద్ధి, పర్యావరణం, అంతర్గత భద్రత, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలపై చర్చలు జరగనున్నాయి. 1997లో రష్యా భాగస్వామిగా చేరి G-8గా పిలుచుకున్నా.. క్రిమియాపై దాడి కారణంగా 2014లో ఈ సమ్మిట్ నుంచి ఆ దేశం బహిష్కరణకు గురైంది.