ప్రస్తుత ఎన్నికల సమయంలో అత్యంత ప్రాధాన్యతాంశంగా ‘కచ్చతీవు ద్వీపం(Katchatheevu Island)’ మారిపోయింది. ఇందిరాగాంధీ హయాంలో ఈ ద్వీపాన్ని శ్రీలంకకు అప్పనంగా ఇచ్చారంటూ ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పడం హాట్ హాట్ గా మార్చింది. ఇలా దేశ ఐక్యతను ‘ఇండియా కూటమి’ విచ్ఛిన్నం చేస్తుందంటూ మోదీ విమర్శించారు. దేశ ప్రయోజనాల్ని తుంగలో తొక్కడం కాంగ్రెస్ లక్షణం అంటూ ‘X’లో ట్వీట్ చేశారు. అటు దీనిపై విదేశాంగమంత్రి జైశంకర్ కూడా అదే రీతిన మాట్లాడారు.
ఏమిటీ వివాదం…!
రెండ్రోజుల క్రితం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురించిన కథనంతో ‘కచ్చతీవు’ వ్యవహారంపై చర్చ మొదలైంది. తమిళనాడు BJP అధ్యక్షుడు అన్నామలై ఇచ్చిన RTI(Right To Information) సమాచారం ఆధారంగా ఆ స్టోరీని TOI ప్రచురించింది. భారత ప్రభుత్వ మెతక వైఖరి వల్లే 1974లో ‘కచ్చతీవు’ ద్వీపం శ్రీలంక పాలైందని తెలిపింది.
కాంగ్రెస్ ఆనాడు దీవిని అప్పగిస్తే నాటి DMK కళ్లప్పగిస్తూ చూస్తూ ఉండిపోయిందని BJP ఆరోపించింది. ఏమీ తెలియనట్లు కాంగ్రెస్, DMK ఉన్నాయి. దీనిపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు 21 సార్లు సమాధానమిచ్చాను అంటూ జైశంకర్ గుర్తు చేశారు. 1974 జూన్ లో భారత విదేశాంగ కార్యదర్శి, అప్పటి CM కరుణానిధి మధ్య చర్చ జరిగిందని తెలిపారు.
‘కచ్చతీవు’ ఎక్కడుంది…!
భారత తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1.9 చదరపు కిలోమీటర్ల ప్రాంతమే ‘కచ్చతీవు’ ద్వీపం. తమిళనాడు రామేశ్వరం సమీపంలోని భారత్-శ్రీలంక భూభూగాల మధ్య ఉన్న ఈ భూమిపై హక్కులు(Claim) వదులుకున్నట్లు బయటపడింది. రామేశ్వరం నుంచి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాఫ్నా నుంచి 16 కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల వెడల్పుతో 285 ఎకరాల్లో విస్తరించి ఉన్నదే ‘కచ్చతీవు’ ద్వీపం. గతంలో సిలోన్(Ceylon)గా పిలుచుకున్న శ్రీలంక.. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ‘కచ్చతీవు’ను తన భూభాగంగా చెప్పుకుంది.
తమ పర్మిషన్ లేకుండా ‘కచ్చతీవు’పై భారత నౌకాదళం(అప్పటి రాయల్ ఇండియన్ నేవీ) విన్యాసాలు చేయకూడదంటూనే 1955 అక్టోబరులో ‘సిలోన్ ఎయిర్ ఫోర్స్’ విన్యాసాలు చేపట్టింది. ఈ చిన్న ద్వీపానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, దాని హక్కుల్ని వదులుకోవడానికి సిద్ధమేనని అప్పటి ప్రధాని నెహ్రూ చెప్పినట్లు కథనంలో రాసింది. దీన్ని పెండింగ్ లో ఉంచడం, మళ్లీ పార్లమెంటులో ప్రస్తావించడం తనకు ఇష్టం లేదని నెహ్రూ చెప్పారట. ఇందుకు సంబంధించిన నోట్ ను అప్పటి కామన్వెల్త్ సెక్రటరీ వైడీ గుండేవియా రూపొందించగా, దీన్ని 1968లో విదేశీ వ్యవహారాల శాఖ పంచుకుంది.
1960లో హక్కులు…
1960లో ‘కచ్చతీవు’పై భారత్ కు హక్కులున్నాయని, వాటిని 1974లో వదలుకున్నట్లు కథనంలో ఉంది. ‘కచ్చతీవు’ శ్రీలంకలో భాగమని చెప్పుకునే ఎలాంటి ఆధారాలు లేవని, తమిళనాడు రాజైన రాజా రామ్ నాథ్ రాచరిక ప్రాంతమని భారత్ అంటున్నది. 1960లో ఏర్పడ్డ వివాదం కాస్తా 1974లో భారత్(ఇందిరాగాంధీ)-లంక(సిరిమావో బండారునాయకే) మధ్య కుదిరిన ఒప్పందంతో దీవి వద్ద సరిహద్దు ఏర్పడి పరిసమాప్తమైంది.
‘కచ్చతీవు’పై భారత్ కు హక్కు ఉందని ఆనాటి అటార్నీ జనరల్ ఎం.సి.సెతల్వాద్ అభిప్రాయపడ్డారని టైమ్స్ కథనం చెప్పింది. ‘కచ్చతీవు’ ద్వీపం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపలు పట్టడం, ఇతర వనరుల కోసం రామనాథపురం రాజుకు ఈస్టిండియా కంపెనీ జమీందారీ హక్కులు ఇచ్చిందని AG గుర్తు చేశారు. ఈ హక్కులు 1875 నుంచి 1948 వరకు కొనసాగాయని, తర్వాత అవి మద్రాసు రాష్ట్రానికి వెళ్లాయని తెలిపారు. బ్రిటిషర్ల నుంచి లీజుకు తీసుకున్న భూభాగాలపై రామనాథపురం రాజు చెల్లించిన అద్దెల ఖాతాలో ‘కచ్చతీవు’ దీవి కూడా ఉంది.
ఇప్పుడే ఎందుకు…
‘కచ్చతీవు’ ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లే మత్స్యకారుల్ని శ్రీలంక అరెస్టు చేస్తున్నదంటూ BJP ఆరోపిస్తున్నది. వ్యూహాత్మకంగా భారత్ కు ఎంతో కీలకమైన ఈ దీవిని వదిలిన పాపం కాంగ్రెస్ దే అంటూ విమర్శలు చేసింది. భారత్-శ్రీలంక మధ్య పాక్ జలసంధి ఉండగా అక్కడ పగడపు దిబ్బలు, ఇసుక మేటలు ఉన్నందున ఆ ప్రాంతం నుంచి ఓడలు ప్రయాణించలేవు. 1755 నుంచి 1763 వరకు మద్రాసు ప్రావిన్స్ గవర్నర్ గా పనిచేసిన రాబర్ట్ పాక్ పేరును ఈ జలసంధికి పెట్టారు. ఈ దీవిని తిరిగి తేవాలంటూ తమిళనాడు 1991 నుంచి ఉద్యమాలు మొదలయ్యాయి.