బంగ్లాదేశ్ లో ఏర్పడ్డ పరిస్థితులు, ఆ దేశ ప్రధాని షేక్ హసీనా భారత్ లో తలదాచుకోవడం వంటి పరిణామాలతో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కీలక సమావేశం నిర్వహించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, అజిత్ దోవల్ సహా కీలక అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ హిండన్ ఎయిర్ బేస్(Air Base)లో తలదాచుకున్న షేక్ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు. బంగ్లా సరిహద్దుల్లో BSF ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
మరోవైపు హసీనా భారత్ నుంచి లండన్ వెళ్లే అవకాశాలున్నాయి. అయితే తన మాతృమూర్తి మరోసారి రాజకీయాల్లోకి రాకపోవచ్చని హసీనా తనయుడు BBCతో అన్నారు. మేఘాలయా సరిహద్దుల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు.