బ్రిటన్ లో భారత సంతతి ప్రధాని, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం పాలైతే.. విపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. నిన్న దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగ్గా… పోలింగ్ ముగిసిన వెంటనే రాత్రికి కౌంటింగ్ మొదలైంది. 650 మంది సభ్యుల హౌజ్ ఆఫ్ కామన్స్(సభ)లో 326 మెజారిటీ రావాలి.
ఎలా ఉందంటే…
లేబర్ పార్టీ 410 సీట్లు, అధికార పార్టీకి 131 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ అంతకన్నా దారుణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సునాక్ పార్టీ 119 సీట్లకే పరిమితమైంది. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం, ఆరోపణలు, ధరల పెరుగుదలపై ఆగ్రహంగా ఉన్న బ్రిటన్ దేశస్థులు.. లేబర్ పార్టీకి 410 సీట్లు కట్టబెట్టారు. తాజా తీర్పుతో కీర్ స్టామర్(Keir Starmer) ప్రధాని పీఠం ఎక్కబోతున్నారు.
మిగతావి…
స్కాటిష్ నేషనల్ పార్టీ, నైగెల్ ఫరాగ్స్, వెల్ష్ నేషనలిస్ట్స్ పార్టీలు తలా కొన్ని సీట్లు సాధించబోతున్నాయి. 61 ఏళ్ల కీర్ స్టామర్ 16 ఏళ్ల వయసులోనే పాలిటిక్స్ లోకి వచ్చారు. మానవ హక్కులపై బారిస్టర్ చదివిన ఆయన.. 2008 నుంచి 2013 కాలంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు.