భారత్ తో పెట్టుకుని అతలాకుతలం అవుతున్న మాల్దీవులు.. మళ్లీ పాత జమానాలోకి రావాలంటే ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని ఆ దేశంలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. చైనా అనుకూలవాదిగా ముద్రపడ్డ అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు.. తక్షణమే మోదీకి క్షమాపణ చెప్పాలంటూ విపక్ష పార్టీలు చెబుతున్నాయి. జమ్హూరీ పార్టీ(JP)కి చెందిన గౌసియమ్ ఇబ్రహీం.. ఈ అంశాన్ని తెరపైకి తెస్తూ అక్కడి అధ్యక్షుడి(President)కి సలహా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ పురోగమిస్తాయని గుర్తు చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే చైనాలో పర్యటించి వస్తూ ఈనెల 13న మాట్లాడిన మయిజ్జు.. మాది చిన్న దేశమే కావచ్చు, కానీ మాపై పెత్తనానికి ఎవరికీ లైసెన్స్ ఇవ్వట్లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు.
అస్తవ్యస్థంగా మారిన ఐలండ్
చిన్న చిన్న దీవుల(Islands)తో కూడిన మాల్దీవులు ప్రస్తుతం అస్తవ్యస్థంగా తయారైంది. పర్యాటక ఆదాయంపైనే ఆశలు పెట్టుకున్న ఆ దేశానికి భారతదేశమే పెద్ద వనరు. అలాంటి భారత్ ను చిన్నచూపు చూసేలా, లక్ష్యద్వీప్ తమ ముందు ఎందుకూ పనికిరాదన్న రీతిలో.. మయిజ్జు కేబినెట్ లోని ముగ్గురు మంత్రులు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఇది తీవ్ర వివాదానికి దారితీయడంతో భారత్ టూరిస్టులంతా మాల్దీవుల పర్యటనల్ని రద్దు చేసుకున్నారు. చివరకు సదరు మంత్రుల్ని తొలిగించినా పరిస్థితి చేయి దాటిపోయింది. ఇలా భారత్ నుంచి రావాల్సిన రెవెన్యూ లేకపోవడంతో ఆ దేశ పరిస్థితి అయోమయంగా తయారైంది. అక్కడి ప్రధాన పార్టీ అయిన MDP(Maldives Democratic Party) సైతం కొద్దిరోజుల క్రితం మోదీకి క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది.
తొలగింపు నోటీసు
భారత వ్యతిరేక విధానాలు గల ప్రెసిడెంట్ మహ్మద్ మయిజ్జుపై ఆగ్రహంతో ఉన్న మాల్దీవుల్లోని విపక్షాలు… అతణ్ని తొలగించే యత్నాలు మొదలుపెట్టాయి. మయిజ్జు అభిశంసన(Impeachment) కోసం అక్కడి పార్లమెంటు(Parliament)లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు సోమవారం నుంచి ఆలోచన చేస్తున్నాయి. తమ దేశంలో ఉన్న భారత బలగాల్ని ఖాళీ చేయాలంటూ ఇంతకుముందే ఆదేశాలిచ్చిన మయిజ్జు సర్కారు.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో భారత్ తో పెట్టుకుని చివరకు తన పదవినే కోల్పోయే స్థాయికి చేరుకున్నారు ప్రెసిడెంట్ మయిజ్జు.
Published 30 Jan 2024