హిమ శిఖర దేశం నేపాల్ మరోసారి ప్రకృతి విలయం బారిన పడింది. ఆ దేశంలో సంభవించిన భారీ భూకంపం(Massive Earth Quake)తో పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇటు ఆ భూకంపం తీవ్రత మన దేశంపైనా పడింది. ఢిల్లీ, యూపీ, బిహార్ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలతో జనం పరుగులు తీశారు. నేపాల్ లో జరిగిన ఘటనలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోగా, పెద్దయెత్తున ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఖాట్మాండుకు 400 కిలోమీటర్ల దూరంలోని జజర్ కోట్ జిల్లాలోని లామిదండా వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలపగా.. శిథిలాల కింద మరింత మంది ఉంటారన్న కోణంలో భారీ యెత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నెల వ్యవధిలో మూడోది
నెల రోజుల వ్యవధిలో నేపాల్ లో సంభవించిన మూడో భూకంపం ఇది. కొద్దిరోజుల క్రితం నేపాల్ లో వచ్చిన భూకంపంతో సిక్కింలో ‘క్లౌడ్ బరస్ట్’ జరిగి పెద్దయెత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. సిక్కింలోని దక్షిణ లోనాక్ సరస్సు ప్రభావితం కాగా.. ఇది ఉప్పొంగడం వల్లే తీస్తా నది(Teesta River)కి ఉన్నట్టుండి భారీ వరదలు వచ్చాయి. సిక్కింలోని అతి పెద్ద జల విద్యుత్తు ప్రాజెక్టు అయిన చుంగ్ తాంగ్ బ్యారేజ్ తెగిపోయింది. తీస్తా స్టేజ్-3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో భాగంగా చుంగ్ తాంగ్ డ్యాం వద్ద 1,200 మెగావాట్ల పవర్ ప్రొడక్షన్ జరుగుతుంటుంది. ఇందులో సిక్కిం రాష్ట్రానిదే మెజారిటీ వాటా. నేపాల్ లో తాజాగా ప్రకృతి విలయం సృష్టించిన విషాదం పట్ల ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ కు తగిన సాయం అందిస్తామని తెలిపారు.