అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్రమోదీ.. అక్కడి ఆర్థికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత ప్రొ.పాల్ రోమర్, హెడ్జ్ ఫౌండ్ రూపకర్త, బ్రిడ్జి వాటర్ అసోసియేట్స్ రే డాలియోతోపాటు పలువురు దిగ్గజాలను కలుసుకున్నారు. భారత్ అవలంబిస్తున్న ఆర్థిక సంస్కరణల గురించి వారికి వివరించారు. తమ దేశంలో అమలవుతున్న డిజిటల్ ప్లాట్ ఫాం తీరును రోమర్ కు తెలియజేస్తూ.. ఆధార్ వినియోగం, డిజిలాకర్ సిస్టమ్స్ ను వివరించారు. ప్రజల జీవన విధానంలో మార్పుల కోసం టెక్నాలజీని విస్తతం చేయడానికి కృషి చేయాలని సంకల్పించారు. ఇక ఆర్థికవృద్ధిని పెంపొందించేలా అమలవుతున్న చర్యలను రే డాలియోకు తెలియజేశారు. భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని డాలియోను కోరారు. ‘దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని డాలియోను కోరాను.. ఆర్థిక సంస్కరణల గురించి చర్చించాం’ అని మోదీ ట్వీట్ చేశారు.
అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి
అంతరిక్ష రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త(ఆస్ట్రోఫిజిసిస్ట్) నీల్ డి గ్రాస్ టైసన్ తో ప్రధాని భేటీ అయ్యారు. భారతదేశం చేపడుతున్న వివిధ మిషన్లు సహా అంతరిక్ష రంగంలో ఫాస్ట్ గా సాధిస్తున్న పురోగతిపై చర్చించారు. నేషనల్ స్పేస్ పాలసీలో భాగంగా కొత్తగా మొదలుపెట్టిన ప్రైవేటు రంగం పాత్ర, విద్యాపరమైన సహకారం తీరుపై చర్చ జరిగింది.
బౌద్ధగురువుతో భేటీ
అమెరికన్ బౌద్ధ గురువు, పద్మశ్రీ అవార్డీ ప్రొ.రాబర్ట్ ధుర్మాన్ తో ప్రధాని మీట్ అయ్యారు. బౌద్ధ వారసత్వ సంపద కోసం దేశం చేస్తున్న కృషిని వివరించిన ప్రధాని.. ప్రపంచ సవాళ్లు-బౌద్ధవిలువలు అంశంపై చర్చించారు. విద్యావేత్త ప్రొ.నికోలస్ తలేబ్ తోనూ మోదీ చర్చలు జరిపారు. ఇండియన్ యంగ్ ఇండస్ట్రియలిస్ట్ ల సామర్థ్యాలు, స్టార్టప్ విధానాలతో కూడిన పర్యావరణ వ్యవస్థ గురించి ఆలోచనలు పంచుకున్నారు.