రష్యా రాజధాని మాస్కో సమీపంలోని క్రాకస్ సిటీ మాల్ లో జరిగిన ఉగ్రవాదుల(Militants) దాడి.. ఎటు దారితీస్తుందోనన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. దాడి జరిపింది తామేనని ఐసిస్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటించినా… రష్యా మాత్రం ఆ నెపాన్ని ఉక్రెయిన్ పై వేసింది. ఇది ఉక్రెయిన్ పనే అంటూ ముందునుంచీ ఆరోపణలు చేస్తున్న క్రెమ్లిన్ నాయకత్వం.. దుండగుల్ని కూడా ఆ దేశం పారిపోతుండగా పట్టుకున్నామని అంటున్నది. ఈ దాడిలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు గాయాల పాలయ్యారు.
రష్యా ప్రకటన…
విచక్షణారహిత(Mercilessly) కాల్పులకు పాల్పడ్డ నలుగురు దుండగుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారిని ఉక్రెయిన్ సరిహద్దు(Border)ల్లో అరెస్టు చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అయితే శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇప్పటికే ISIS-K ఉగ్ర సంస్థ ప్రకటించింది.
సిరియా అధ్యక్షుడు బషర్ అస్సద్ కు అనుకూలంగా సైన్యాలను దించి ISISతోపాటు అతివాద గ్రూపులను రష్యా ఏరివేయడంపై ఈ మిలిటెంట్ గ్రూప్ ఆగ్రహంతో ఉంది. రష్యా మద్దతుతోనే సిరియా ప్రెసిడెంట్ తమను ఏరివేస్తున్నారన్న కోపంతో రష్యాపై ISIS-K దాడులు చేస్తున్నది.
ఇష్యూ టర్న్…
అసలు విషయం ఇలా ఉంటే ఇది ఉక్రెయిన్ హస్తంతోనే జరిగిందంటూ రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ కు పారిపోతున్న సమయంలోనే దుండగుల్ని పట్టుకున్నట్లు తెలపడంతో ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి లింక్ పెట్టినట్లయింది. ఇది తమ పనేనని ఐసిస్ ప్రకటించినా రష్యా మాత్రం ఈ నెపాన్ని ఉక్రెయిన్ పైనే మోపుతున్నది. దీంతో ఇది ఎటువైపు దారితీస్తుందోనన్న అనుమానాలు కనపడుతున్నాయి. ఇదే అదనుగా కీవ్ పై దాడుల్ని మరింత పెంచే ప్రమాదం పొంచి ఉన్నట్లు అంతర్జాతీయ రాజకీయ నిపుణులు సందేహపడుతున్నారు.