
Published 06 Jan 2024
సముద్ర జలాల్లో దొంగల దౌర్జన్యం అంతకంతకూ పెరిగిపోతున్న దృష్ట్యా భారత నౌకాదళం తన అమ్ములపొదిలోని అస్త్రాలను బయటకు తీస్తోంది. అరేబియా సముద్రంలో హైజాకర్ల పనిపట్టడంలో మన మన నౌకదళ వీరులు సాహసోపేత దాడి(Rescue Operation)తో ముచ్చెమటలు పట్టించారు. హైజాక్ చేసిన వాణిజ్య నౌక(Ship)ను రక్షించడమే కాక అందులో ఉన్న 21 మంది సిబ్బందిని కాపాడారు. తమ నౌక హైజాక్ కు గురైందని, వెంటనే కాపాడాలంటూ అందిన మెసేజ్ తో రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ.. INS చెన్నై డిస్ట్రాయర్ షిప్ తోపాటు యుద్ధ విమానం, డ్రోన్లను రంగంలోకి దించింది. దీంతో భారత మెరైన్ కమెండోల వార్నింగ్ తో హైజాకర్లు పారిపోయారు. కొద్దిరోజుల క్రితం కూడా భారత్ వస్తున్న షిప్ పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలోనూ ‘ICGS విక్రమ్’ను రంగంలోకి దింపిన నేవీ అధికారులు.. సురక్షితంగా ఆ నౌకను తీరానికి తీసుకురాగలిగారు.
జరిగింది ఇదీ…
ఎం.వి.లీలా నార్ ఫోక్ షిప్ హైజాక్ అయినట్లు శుక్రవారం పొద్దున యునైటెడ్ కింగ్ డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ నుంచి నౌకాదళానికి ఇన్ఫర్మేషన్ అందింది. ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలోకి ఐదారుగురు హైజాకర్లు ప్రవేశించారు. అందులోని సిబ్బంది భయంతో ఒకచోట దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర జలాల్లో గస్తీని పెంచిన నేవీ.. తమను రక్షించాలంటూ అందిన మెసేజ్ తో వెంటనే రంగంలోకి దిగింది. హైజాక్ అయిన నౌకలోని సిబ్బందితో కాంటాక్ట్ అయిన మెరైన్ కమెండోలు.. షిప్ ను వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా వార్నింగ్ ఇచ్చారు. తమ ఆటలు సాగవని భావించిన హైజాకర్లు అందులోనుంచి పారిపోగా.. అనంతరం కమెండోలు ఎం.వి.లీలా నార్ ఫోక్ షిప్ లోకి ఎంటరయ్యారు. అందులో ఒక రూమ్ లో దాక్కున్న సిబ్బందిని సేఫ్ గా బయటకు తీసుకువచ్చి ఘనంగా ఆపరేషన్ ను ముగించారు.