మహిళల శ్రామిక శక్తి(Women’s Labour Market) తీరుతెన్నులపై పరిశోధన చేసినందుకు గాను అమెరికన్ మహిళ క్లాడియా గోల్డిన్ కు ‘ఆర్థిక శాస్త్రం’లో నోబెల్ ప్రైజ్ దక్కింది. శతబ్దాల కాలం నుంచి మార్కెట్ భాగస్వామ్యంలో మహిళలకున్న వాటా, వారి ఆదాయ స్థితిగతులపై ఆమె విస్తృతంగా రీసెర్చ్ సాగించారు. అంతకంతకూ పెరుగుతున్న మహిళా భాగస్వామ్యంతో ప్రపంచ వ్యాప్తంగా లింగ సమానత్వం(Gender Equality) కనుమరుగు అవుతున్నదని తెలియజేశారు. అన్ని రంగాల్లో స్త్రీల పాత్ర పెరగడం, వారి సంపాదన తీరుతో మగవారి కంటే ఏ మాత్రం తీసిపోవడం లేదని నిరూపించారు. క్లాడియా సేవల్ని కొనియాడుతూ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ స్టాక్ హోం.. ‘నోబెల్ ప్రైజ్’ ను ప్రకటించింది. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి బహుమతుల్ని ప్రకటించిన నోబెల్ కమిటీ.. తన చివరి ప్రైజ్ ను ఈ రోజు క్లాడియాకు ఇస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటివరకు ఇద్దరే మహిళలు
క్లాడియా గోల్డిన్ తన రీసెర్చ్ కోసం విస్తృత స్థాయిలో శోధించారు. 200 ఏళ్ల చరిత్రను పరిశీలించి మహిళల స్వావలంబనపై అవగాహనకు వచ్చారు. ఉద్యోగిత(Employment), ఆదాయ సముపార్జన(Income Earnings) అంశాల్లో మహిళలు, పురుషుల మధ్య నెలకొన్న భేదాల్ని తన రిపోర్ట్ లో పొందుపరిచారు. 19వ శతాబ్దంలో వివాహిత మహిళలు ఉద్యోగ రంగంలో క్రమంగా తగ్గుముఖం పట్టినా మళ్లీ 20 శతాబ్దంలో తిరిగి పుంజుకున్నట్లు తెలియజేశారు. 1968లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం మొదలైన తర్వాత ఇప్పటివరకు 92 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కానీ అందులో క్లాడియాతో కలిపి ఇద్దరు మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ అవార్డుల్ని విజేతలకు డిసెంబరులో స్టాక్ హామ్ లోని ఓస్లోలో అందజేస్తారు. ప్రైజ్ మనీ కింద ఒక్కో విభాగంలో 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు(మిలియన్ డాలర్లు-రూ.8.3 కోట్లు) అందజేస్తారు.