ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పరిశోధనలు(Research) జరిపిన శాస్త్రవేత్త(Scientists)లకు నోబెల్ ప్రైజ్ దక్కింది. 2023కు గాను ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ బహుమతిని అందుకోబోతున్నారు. వైద్యశాస్త్రంలో న్యూక్లియాసైడ్ బేస్ సంబంధించిన రీసెర్చ్ కు గాను క్యాటలిన్ కరికో, డ్రూ వెజ్ మాన్ లకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. కొవిడ్ ను కట్టడి చేసేందుకు గాను mRNA వ్యాక్సిన్లను ఈ ఇద్దరూ కనుగొన్నారని, ఆపత్కాలంలో వారిద్దరూ చూపిన మార్గం ప్రపంచాన్ని సురక్షితంగా బయటపడేసిందని స్వీడన్ లోని నోబెల్ కమిటీ కొనియాడింది. హంగరీకి చెందిన క్యాటలిన్ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వెజ్ మాన్ లు చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది.
టీకా అభివృద్ధిలో ఇద్దరి పాత్ర కీలకం
సంచలనాత్మక అన్వేషణల ద్వారా రోగనిరోధక వ్యవస్థతో mRNA ఎలా సంకర్షణ చెందుతుందనే దానిపై తమ పరిశోధనల ద్వారా కరికో, వెజ్ మాన్ వెల్లడించారు. ఆధునిక కాలంలో మానవ మనుగడకు అతిపెద్ద ముప్పుగా మారిన కొవిడ్-19ను అంతం చేయడానికి ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సాగించిన పరిశోధనల ద్వారా టీకా అభివృద్ధిలో ముందడుగు వేయగలిగామని నోబెల్ కమిటీ వివరించింది. 2020 చివరి నాటికి రెండు అత్యంత సక్సెస్ ఫుల్ mRNA ఆధారిత వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి వీరి రీసెర్చ్ కీలకంగా నిలిచారని అభినందించింది.