జపాన్ లోని ఫుకుషిమా(Fukushima) న్యూక్లియర్ ప్లాంట్ నుంచి అణు వ్యర్థాల్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ లో భాగంగా ఈ రోజు నుంచి వ్యర్థాల్ని సముద్రంలోకి పంపుతున్నారు. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ హోల్డింగ్స్(TEPCO) ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి న్యూక్లియర్ వేస్ట్ వాటర్ ను సాగరంలోకి పంపుతున్నారు. ఈ తతంగం కొన్ని దశాబ్దాల పాటు సాగనున్నట్లు జపాన్ ప్రకటించింది. ఫస్ట్ ఫేజ్ వాటర్ రిలీజ్ మొన్నటి ఆగస్టు 24న ప్రారంభమై సెప్టెంబరు 11న ముగియగా 10 ట్యాంకుల్లోని 7,800 టన్నుల్ని తరలించారు. ఈరోజు నుంచి రెండో దశ మొదలవుతుండగా.. ఈ 17 రోజుల్లో మరో 7,800 టన్నుల వ్యర్థాల్ని విడిచిపెడుతున్నారు. 2011లో సునామీ వచ్చిన తర్వాత జపాన్ లోని ఫుకుషిమా ప్లాంటు పూర్తిగా దెబ్బతింది. అందులోని 1,000 ట్యాంకుల్లో 1.34 మిలియన్ల రేడియో ధార్మిక వ్యర్థాలు పేరుకుపోయాయి. ఈ వ్యర్థాల్ని పసిఫిక్ మహా సముద్రంలోకి విడిచిపెట్టడం మినహా మరో గత్యంతరం లేదని జపాన్ చెబుతున్నది.
చైనా బ్యాన్.. సౌత్ కొరియా అబ్జర్వేషన్
వ్యర్థాలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వాటిని నీటిలోనే విడగొట్టి(Dialute) సాగరంలోకి వదులుతున్నామని జపాన్ అంటోంది. వందల సార్లు వడపోత ద్వారా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటున్నది. జపాన్ తీరును నిరసిస్తూ పొరుగు దేశాలైన చైనా, దక్షిణ కొరియాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. జపాన్ సముద్ర జలాల్లో పట్టిన చేపల్ని దిగుమతి చేసుకోకూడదని చైనా నిర్ణయించింది. పర్యావరణానికి హానిగా మారిన చేపల దిగుమతుల్ని నిషేధించింది. తమ దిగుమతుల్ని చైనా నిలిపివేయడంతో ప్రత్యేక ఫండ్ ను జపాన్ ఏర్పాటు చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో సీ ఫుడ్ ని అమ్మేందుకు ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటున్నది. జపాన్ మంత్రులు సైతం ఫుకుషిమా ప్రాంతానికి చేరుకుని సీ ఫుడ్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
పరిణామాల్ని గమనిస్తున్న IAEA
మరోవైపు ఈ పరిణామాల్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(International Atomic Energy Agency) జాగ్రత్తగా గమనిస్తున్నది. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సముద్ర తీర ప్రాంతాలు, మెరైన్ డిపార్ట్ మెంట్స్, మానవ మనుగడకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉన్నందున.. పరిణామాలను సునిశితంగా అబ్జర్వ్ చేస్తోంది.