ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సలహా మేరకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ(National Assembly)ని రద్దు చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆదేశాలు ఇచ్చారు. నేషనల్ అసెంబ్లీ రద్దు కావడంతో మూడు నెలల్లో అధికారికంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అప్పటివరకు ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుందని అధ్యక్షుడు తెలిపారు. 2023 డిజిటల్ జనగణన(Census) ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్షన్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తెలిపింది.
16 నెలల పాటు పాక్ ప్రధానిగా పనిచేసిన షెహబాజ్ షరీఫ్… తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సిట్యుయేషన్ ఎన్నడూ చూడలేదని అన్నారు. సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ కు ప్రధానిగా తీవ్ర ఒత్తిడిలో పనిచేయాల్సి వచ్చిందని నేషనల్ అసెంబ్లీ మీటింగ్ లో షరీఫ్ అన్నారు. ఆయిల్ కొరతతో ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితుల్లో PMగా ఉన్నానని గుర్తు చేశారు. ఏప్రిల్ 2022లో బాధ్యతలు చేపట్టిన షహబాజ్.. గత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇమ్రాన్ సర్కారు విధానాలతోనే పాక్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.