దాయాది దేశమైన పాకిస్థాన్(Pakistan) ఎన్నికల్లో(Elections) ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. దీంతో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో హంగ్ ఏర్పడినట్లు పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగ్గా, 9వ తేదీ నుంచి కౌంటింగ్ మొదలు పెట్టారు. అధికారిక రహస్యాలు బయటపెట్టిన కేసులో కోర్టు తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తుండగా.. ఆయన పార్టీకి చెందిన మద్దతుదారులే పాక్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించారు. అటు నవాజ్ షరీఫ్ పార్టీకి ఇమ్రాన్ పార్టీ కన్నా తక్కువ రావడంతో ఈ రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు పాక్ వర్గాలు అంటున్నాయి.
పార్టీల వారీగా…
పాక్ లో ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించే మిలిటరీ సైతం.. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ విజయం సాధిస్తారని భావించింది. కానీ అందుకు భిన్నంగా ఇమ్రాన్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఇమ్రాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(Pakistan Tehreek-E-Insaf) 102 స్థానాలు గెలుచుకోగా… షరీఫ్ కు చెందిన పీఎంఎల్-ఎన్(Pakistan Muslim League-Nawaz)కు 73 సీట్లు దక్కాయి. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)కి 53 చోట్ల విజయం సాధిస్తే, ముత్తహిదా ఖవామీ మూవ్మెంట్(MQM) 17 సీట్లు గెలుచుకుంది. పాక్ నేషనల్ అసెంబ్లీలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఇప్పటివరకు 255 చోట్ల రిజల్ట్స్ వచ్చాయి.
మెజార్టీ కోసం…
పాక్ లో అధికారాన్ని దక్కించుకోవాలంటే 133 స్థానాల మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవాలి. ఆ దేశంలో మొత్తం 336 స్థానాలున్నా 265 సెగ్మెంట్లకు ఎన్నికలు జరిగాయి. ఒక అభ్యర్థి చనిపోవడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ఇక మిగతా 70 సీట్లను మహిళలు, మైనారిటీ వర్గాలకు రిజర్వ్ చేశారు. మరి దేశద్రోహం కింద అరెస్టయిన ఇమ్రాన్ తో నవాజ్ షరీఫ్ చేతులు కలుపుతారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఇద్దరు మాజీ ప్రధానుల పైనే పాకిస్థాన్ భవితవ్యం ఆధారపడి ఉంది.
Published 10 Feb 2024