అనిశ్చితి, అయోమయం, గందరగోళంగా తయారైన పాకిస్థాన్.. భారత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆ దేశ నేతలే బహిరంగంగా చెబుతుంటారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోపాటు కొందరు లీడర్లు తరచూ భారత్ ను ఆకాశానికెత్తేస్తారు. ఇప్పుడు ఆ పార్టీకే(PTI) చెందిన సీనియర్ లీడర్, MP సయ్యద్ షిబ్లి ఫరాజ్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. స్వయంగా పార్లమెంటులోనే ఆయన ఈ పనిచేశారు.
ఏమన్నారంటే…
‘మన శత్రువు జరిపిన లోక్ సభ ఎన్నికల నుంచి మనం చాలా నేర్చుకోవాలి.. మనం అంత ఫ్రీగా, పారదర్శకం(Fair)గా ఎలక్షన్లు ఎందుకు జరుపుకోవట్లేదు.. ఎలాంటి ఆరోపణలు, దాడులు, రిగ్గింగ్స్ లేకుండా నెల రోజుల పాటు EVMల ద్వారా ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించారు.. రోడ్డు లేని చోట కూడా పోలింగ్ బూత్ లు పెట్టడంతోపాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రశాంతంగా ఓటు వేశారు. మన పొలిటికల్ సిస్టమే అలా ఉంది.. కలహాలు, కుమ్ములాటలతోనే కాలం గడుస్తున్నది..’ అని అన్నారు.
ఫిబ్రవరిలో…
2024 ఫిబ్రవరి 8న పాకిస్థాన్ లో ఎన్నికలు జరిగాయి. ఇమ్రాన్ పార్టీ మెజార్టీ సాధించినా పవర్ దక్కకుండా అడ్డుకుని జైలుకు పంపారు. పాక్ సర్కారు ఏదైనా సైన్యం చెప్పుచేతల్లో ఉండాల్సిందే. రావల్పిండిలోని అడ్యాల జైలులో ఉన్న ఇమ్రాన్ వీడియో లింక్ ద్వారా సుప్రీంకోర్టుతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని దొంగిలించారన్నారు.
ఫరాజ్ ఒక్కడే కాదు.. మరో MP ముస్తఫా కమల్ సైతం గత నెలలో భారత్ ను పొగిడారు. ‘భారత ఆర్థిక, విద్యావ్యవస్థలు ఎంత పటిష్ఠంగా ఉన్నాయో చూడండి.. ప్రపంచమంతా చంద్రునిపై అడుగుపెడుతుంటే.. మన పిల్లలు మురికి కాల్వల్లో పడి చనిపోతున్నారు.. చంద్రునిపై భారత్ కాలు మోపిందన్న వార్త విన్న రెండు సెకన్లలోనే కరాచీలో మురికికాల్వలో బాలుడు అన్న వార్త వినాల్సి వచ్చింది..’ అన్న ముస్తఫా కమల్ మాటలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.