నేపాల్ లోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయాన్ని బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు మూసివేశారు. 5వ శతాబ్దపు హిందూ దేవాలయమైన పశుపతినాథ్ ఆలయానికి చెందిన స్వర్ణాభరణాల విషయంలో ఈ మధ్య ఆరోపణలు వెల్లువెత్తాయి. గత మహాశివరాత్రి పర్వదినం నాడు అమర్చిన ఆభరణాలలో 10 కిలోలకు పైగా బంగారం మాయమైనట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై అక్కడి ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ… ప్రత్యేక విచారణకు కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అథారిటీ(CIAA) ఏర్పాటు చేశారు.
నేపాల్ ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు… శివలింగం చుట్టూ గల ఆభరణాలను పరిశీలించారు. పశుపతి ఏరియా డెవలప్ మెంట్ ట్రస్ట్(PADT) నిర్వాహకుల ఆధ్వర్యంలో తూకం, నాణ్యతను నిర్ణయించే కార్యక్రమంలో భాగంగా నగలను ప్రధాన ఆలయం నుంచి బయటకు తెచ్చారు. వాటి పరిశీలన పూర్తయ్యాక తిరిగి 100 కిలోల వస్తువుల్ని యథావిధిగా అమర్చారు.