తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్.. తమ ప్రజలకు బుక్కెడు తిండి అందించలేని దుస్థితికి చేరుకుంది. దేశంలోని 40 శాతం ప్రజలు దుర్భర జీవితాల్ని అనుభవిస్తున్నారని అంతర్జాతీయ ద్రవ్యనిధి(International Monetary Fund-IMF) వెల్లడించింది. ఒక్క ఏడాదిలోనే 12.5 మిలియన్ల(1.25 కోట్ల) జనాభా పేదరికంలోకి చేరిపోయిందని, నష్ట నివారణ చర్యలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందని IMF తెలిపినట్లు అమెరికాకు చెందిన ‘ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్’ న్యూస్ పేపర్.. కథనం ప్రచురించింది. సంవత్సరం క్రితం 34.2%గా ఉన్న పేదరికం ప్రస్తుతం 39.4 శాతానికి చేరుకుందని.. రోజుకు మూడు US డాలర్లు(మన కరెన్సీలో రూ.302) సంపాదించలేని దుస్థితిలో వీరంతా ఉన్నారని కథనంలో పేర్కొంది.
అనవసర ఖర్చులు తగ్గిస్తేనే
ప్రస్తుతానికి పాకిస్థాన్ వ్యాప్తంగా 95 మిలియన్లు(9.5 కోట్ల మంది) కటిక దరిద్రంలో చిక్కుకున్నారని సాక్షాత్తూ వరల్డ్ బ్యాంకే గుర్తించిందని ఆ పత్రిక తెలిపింది. పేదరికాన్ని తగ్గించాలంటే ఆర్థిక సంస్కరణలు అమలు చేయాల్సి ఉందని.. అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్ రంగాలపై దృష్టిపెట్టడంతోపాటు అనవసర ఖర్చుల్ని భారీస్థాయిలో తగ్గించుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది.