ప్రభుత్వ ఉద్యోగాల్లో తెచ్చిన రిజర్వేషన్లు పొరుగుదేశమైన(Neighbour) బంగ్లాదేశ్ ను అల్లకల్లోలం చేసింది. ఆందోళనకారుల దాడితో షేక్ హసీనా సర్కారు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. పోలీసులు కాల్పుల్లో 105 మంది చనిపోగా.. 2,500 మంది గాయపడ్డారు. రాజధాని ఢాకా(Dhaka)లోనే 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ నిలిపివేసి ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం విధించి సైన్యాన్ని రంగంలోకి దించింది. 1971లో పాకిస్థాన్ తో యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల బంధువులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో మూడో వంతు రిజర్వేషన్లు కేటాయించడంపై గొడవ మొదలైంది. బంగ్లాలో 8 వేల మంది విద్యార్థులతోపాటు 15 వేల మంది భారతీయులున్నట్లు మన విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇప్పటికే వెయ్యి మందిని తరలించగా.. మిగతా వారిని దశలవారీగా రప్పించే ఏర్పాట్లు చేసింది. భూటాన్, నేపాల్ మీదుగా వచ్చేందుకు ఆ దేశాలు సైతం భారత్ కు సహకరిస్తున్నాయి. చిట్టగాంగ్, రాజ్ షాహి, సిల్హెట్, ఖుల్నాలోని భారత డిప్యూటీ హైకమిషన్ కార్యాలయాలు మనవాళ్లను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి.