ఉద్యోగాల పేరిట మోసపోయి రష్యా సైన్యం(Military)లో చిక్కుకుని ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతున్న భారతీయులు విడుదలయ్యారు. మొన్నటి మాస్కో టూర్లో పుతిన్ తో భేటీ అయిన మోదీ విన్నపం మేరకు వీరంతా బయటపడ్డారు. రష్యా మిలిటరీలో 100 మంది దాకా భారత పౌరులు ఉండగా, ఇప్పుడు 45 మంది విడుదలయ్యారు.
ఎలా వెళ్లారంటే…
రష్యాలో మంచి ఉద్యోగాలున్నాయంటూ న్యూఢిల్లీ నుంచి తమిళనాడు వరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసి మానవ అక్రమ రవాణా గ్యాంగ్.. అమాయకుల్ని బుట్టలో వేసుకుంది. వీరంతా అక్కడకు చేరుకున్న తర్వాత పాస్ పోర్టులు లాక్కోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సైన్యంలో చేరారు. పంజాబ్-హర్యానాకు చెందిన కొందరు యువకులు అక్కడి ఆర్మీ డ్రెస్ ధరించి వీడియో తీసి పంపగా అది సంచలనమైంది.
అలా రష్యా-ఉక్రెయిన్ వార్ లో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఇదే విషయాన్ని పుతిన్ తో మోదీ చర్చించడంతో దౌత్యం ఫలించింది. అక్రమాలకు పాల్పడిన నలుగురు సభ్యుల ‘జాబ్ రాకెట్’ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.