అణ్వాయుధం.. ఈ పేరు చెబితే చాలు శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఉత్తర కొరియా వంటి చిన్న దేశం కూడా అగ్రరాజ్యాలకు వణుకు పుట్టించేలా అణ్వస్త్రాల(Nuclear Weapons)నే ఆసరాగా చేసుకుని బెదిరిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తం(Worldwide)గా ప్రస్తుతం ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయనే దానిపై తన వార్షిక నివేదిక(Year Book)లో ‘సిప్రి’ సంస్థ ప్రకటించింది.
12 వేలకు పైగా…
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలు కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలు తమ రక్షణ కోసం ఈ తరహా ఆయుధాల్నే నమ్ముకున్నాయని సిప్రి(స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్-SIPRI) రిపోర్ట్ బయటపెట్టింది. మొత్తం 9 దేశాలు అమెరికా(5,044), రష్యా(5,580), ఇంగ్లండ్(225), చైనా(500), ఫ్రాన్స్(290), భారత్(172), పాకిస్థాన్(170), ఇజ్రాయెల్(90), ఉత్తరకొరియా(50) దేశాల్లో 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం ఆయుధాల్లో 90% US, రష్యాలోనే ఉంటే.. ప్రపంచంలో 9,585 ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లోనే ఉన్నాయి.
వార్ హెడ్స్…
మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ ల ద్వారా ప్రయోగించగలిగే వార్ హెడ్స్ 3,904 ఉండగా, బాలిస్టిక్ మిసైళ్ల ద్వారా ప్రయోగించేవి 2,100 ఉన్నాయి. ఇప్పటివరకు ఇలాంటివన్నీ అమెరికా, రష్యా వద్దే ఉండగా తొలిసారి చైనా ఈ తరహా ఆయుధాల్ని సిద్ధం చేసుకున్నాయని ఏటేటా వీటి సంఖ్య పెరిగిపోతూనే ఉందని సిప్రి డైరెక్టర్ డాన్ స్మిత్ తెలిపారు. భారత్, పాక్, ఉత్తర కొరియా దేశాలు సైతం బాలిస్టిక్ క్షిపణుల ద్వారా తరలించే వార్ హెడ్లను పోగు చేసుకుంటున్నాయన్నారు.