మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అసలే ఆర్థిక సంక్షోభం(Crisis)లో చిక్కుకున్న శ్రీలంకకు తాజా ఎలక్షన్లు గుదిబండలా తయారయ్యాయి. మొన్ననే అధ్యక్షుడి(President)గా ఎన్నికైన అనుర కుమార దిసనాయకే.. ఏకంగా పార్లమెంటును రద్దు చేశారు. దీంతో 11 నెలల ముందుగానే పార్లమెంటు గడువు ముగిసిపోగా.. ఇప్పుడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్ల కంటే పార్లమెంటు ఎన్నికల ఖర్చే ఎక్కువని ఆ దేశ ఎలక్షన్ కమిషనర్ జనరల్ సమన్ శ్రీ రత్నాయకే తెలిపారు.
అధ్యక్ష ఎన్నికలకు శ్రీలంక కరెన్సీలో 1000 కోట్లు(భారత కరెన్సీలో రూ.300 కోట్లు) వెచ్చించగా, జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు 1100 కోట్ల శ్రీలంక కరెన్సీ ఖర్చు చేయాల్సి ఉంది. ఈ బడ్జెట్లో అసలు పార్లమెంటు ఎన్నికల ప్రస్తావన లేకపోగా, దానికి నిధులే కేటాయించలేదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆగస్టులోనే ఎలక్షన్లు ఉంటాయని మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భావించారు. కానీ కొత్త అధ్యక్షుడి నిర్ణయంతో లంక పరిస్థితి మరింత దయనీయంగా మారే పరిస్థితి ఏర్పడింది.