గత 25 ఏళ్లలో ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో భూకంపం రావడంతో తైవాన్ ప్రజలు అల్లాడిపోయారు. తెల్లవారుజామున వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైనట్లు జపాన్ భూకంప కేంద్రం ప్రకటించింది. సునామీ వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు(Warning) ఇచ్చింది. జపనీస్ ద్వీపకల్పం(Island)లోని మియాకొజిమ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భవనాలు పేకమేడల్లా…
ఈ భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. 1999 సెప్టెంబరులో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు. తైవాన్ కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో భూకంపం సంభవించింది. ఆ సమయంలో ప్రజలు విధుల్లోకి(Duties) వెళ్లేందుకు రెడీ అవుతుండగా, చాలామంది బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మెట్రోల్లో జర్నీ చేస్తున్న సమయంలో భూకంపంతో ఊగిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీని ధాటికి నలుగురు ప్రాణాలు కోల్పోగా, పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
సమీప దేశాల్లో…
తైవాన్ భూకంపంతో జపాన్(Japan), ఫిలిప్పీన్స్(Philippines) వంటి దేశాలు సునామీ అలర్ట్ జారీ చేశాయి. సముద్ర తీర ప్రాంతాల్లోని జనాన్ని తరలించాలని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. జపాన్ లోని ఒకినావా ఎయిర్ పోర్ట్ లో విమానాల్ని రద్దు చేశారు. ప్రస్తుతానికి తీర ప్రాంతాల్లో అలలు 12 మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలో తైవాన్ సరిహద్దులైన ఒకినావా, యొనగుని ఐలాండ్ ప్రాంతాల్లో రాకపోకల్ని నిషేధించింది(Banned).