Published 23 Dec 2023
ఖలిస్థాన్ మద్దతుదారుల(Khalistan Supporters) ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. పాకిస్థాన్ అనుకూల ఖలిస్థాన్ దుండగులు వివిధ దేశాల్లో భారత వ్యతిరేకతను చాటుకుంటున్నారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోనూ దుస్సాహసానికి పాల్పడి, హిందువులు ఆరాధించే దేవాలయంపైనే దాడికి తెగబడ్డారు. కాలిఫోర్నియాకు ఆనుకుని ఉన్న న్యూఆర్క్ ప్రాంతంలో గల స్వామి నారాయణ్ మందిర్ పై గురువారం అర్థరాత్రి దుండగులు దాడికి పాల్పడ్డారు. యాంటీ హిందూ-యాంటీ ఇండియా స్లోగన్స్ తోపాటు అక్కడి గోడల మీదున్న చిత్రాలపై ఇంక్ చల్లారు. గురువారం అర్థరాత్రి ఘటన జరిగితే శుక్రవారం రాత్రికి ఈ విషయం బయటపడింది. టెంపుల్ కు సంబంధించి భార్గవ్ రావల్ అనే వ్యక్తి ఫిర్యాదుతో అక్కడి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా.. ఇది టార్గెటెడ్ దాడిగా చెబుతున్నారు. ఖలిస్థానీ మద్దతు దారుల నినాదాలు విన్నట్లు అక్కడి వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చారు.
మండిపడ్డ ఎంబసీ
ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ దాడి ఘటన హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితుల్ని అరెస్టు చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. భారత వ్యతిరేక శక్తులుగా తయారైన ఖలిస్థాన్ తీవ్రవాదులు ఈ మధ్యకాలంలో రెచ్చిపోతున్నారు. కెనడాలో ఖలిస్థాన్ నేత గుజ్జర్ హత్య కేసు తర్వాత భారత్-కెనడా సంబంధాలపై ఆ ఘటన తీవ్ర ప్రభావం చూపింది. రాయబార కార్యాలయాల్లోని(Embassy) సిబ్బందిని వెనక్కు రప్పించుకోవాల్సి వచ్చింది. కొద్ది కాలం క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ ఎంబసీపైనా ఖలిస్థాన్ తీవ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. డోర్లు బద్ధలు కొట్టి ఖలిస్థానీ జెండాలతో దూసుకెళ్లారు. మొన్నటి ఆగస్టులో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లోనూ ఇదే రీతిలో ఆలయంపై ఇంక్ చల్లారు.