అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనిచేశారు. మూడు దేశాలపై సుంకాలు(Tariffs) విధించి ఝలక్ ఇచ్చారు. చైనా, కెనడా, మెక్సికో దేశాలపై టారిఫ్ లు విధించారు. దేశీయ తయారీని పెంచి అమెరికా ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25 శాతం, చైనా వస్తువులపై 10 శాతం టారిఫ్ విధించారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల(Drugs)ను అడ్డుకునేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(IEEPA) ఆధారంగా ఈ సుంకాలు వేశారు. ట్రంప్ ఆదేశాల ప్రకారం ఈ నెల 4 అర్థరాత్రి నుంచి నిర్ణయం అమల్లోకి వస్తుంది. కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకుంటామన్న ప్రకటన, మెక్సికో సరిహద్దు చుట్టూ గోడ నిర్మాణంతో రగడ జరుగుతోంది. ఇక తమ వస్తువులపై టారిఫ్ లు పెంచడంతో గతంలోనే చైనాతో వాణిజ్య యుద్ధం(Trade War) జరిగింది. ఇప్పుడీ తాజా నిర్ణయంతో డ్రాగన్ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.