యుద్ధమంటే మారణహోమం… యుద్ధమంటే రాక్షస కాండ… శాంతి మంత్రం జపిస్తున్న ప్రస్తుత రోజుల్లో యుద్ధం బారిన పడిన దేశాల సంగతి ఎలా ఉంటుందో ఉక్రెయిన్ ను చూసి తెలుసుకోవచ్చు. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న వార్.. మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఆధునిక కాలంలో అత్యంత దారుణమైన ఘటనగా చరిత్రకెక్కుతోంది. ఈ దాడి మొదలై శుక్రవారం నాటికి 500 రోజులైంది. ఈ 500 రోజుల్లో 500 మంది చిన్నారులు కన్నుమూయగా… మొత్తంగా ఉక్రెయిన్ మృతుల సంఖ్య 9,000కు పైమాటేనట. స్వయంగా ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్(UN)కు చెందిన హ్యూమన్ రైట్స్ మానిటరింగ్ మిషన్(HRMMU) ధ్రువీకరించింది.
ఈ దారుణ దురాగతంలో లెక్కలు ఈ విధంగా కనిపిస్తున్నా ఆ సంఖ్య అంతకు మించి ఉంటుందని HRMMU స్పష్టం చేసింది. అయితే 2022తో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూణ్నెల్లల్లో మరణాల రేటు తగ్గినా… మళ్లీ మే, జూన్ లో యావరేజ్ పెరిగిందని గుర్తించింది. పౌర మరణాల గురించి UN మానవ హక్కుల కార్యాలయం నివేదిక ప్రచురించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 2023 జూన్ 30 వరకు గల కాలాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలైంది. ఈ దాడుల్లో మొత్తం 25,170 మంది బాధితులుగా మారితే… అందులో 9,177 మంది మృతి చెందినట్లు, మరో 15,993 మంది హాస్పిటల్ పాలైనట్లు నివేదిక వెల్లడించింది.