
Published 16 Dec 2023
ఏ దేశానికైనా వెళ్లాలనుకుంటే మొదటగా ఆలోచించేది వీసా గురించే. డబ్బులుండి దేశాలు తిరిగొద్దామనుకున్నా వీసా దొరకడం కష్టం కాబట్టి ఆ ఆలోచననే విరమించుకుంటారు చాలామంది. కానీ కరోనా తర్వాత టూరిజంతో ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్న చాలా దేశాలు భారతీయులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ వంటి దేశాలు ఇప్పటికే వీసా అవసరం లేదంటూ ప్రకటిస్తే తాజాగా ఇరాన్ సైతం అదే బాటలో నడిచింది. మొత్తంగా 23 దేశాలు భారతీయుల్ని తమ వద్దకు ఆహ్వానిస్తూ ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. కొవిడ్ కాలంలో రెండేళ్ల పాటు పూర్తి నిశ్శబ్దం ఏర్పడగా, తర్వాత కాలంలో కుదురుకోవడానికే టైమ్ పట్టింది. ఇలా నాలుగేళ్ల పాటు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కాగా, వీసా-ఫ్రీ సిస్టమ్ ఒక్కటే తమకు దారి అన్న రీతిలో ప్రపంచ దేశాలు నిర్ణయానికి వచ్చాయి.

భారతీయులపై నమ్మకమేనా
ప్రశాంతతకు, విశ్వసనీయతకు మారుపేరు భారత్. అలాంటి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా అరుదైన గుర్తింపు లభిస్తోంది. మా దేశానికి రావాలంటే వీసా అక్కర్లేదంటూ మనవాళ్లకు చాలా దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. మారిషస్, నేపాల్, భూటాన్, మాల్దీవులు, ఒమన్, హాంకాంగ్, కజకిస్థాన్, బార్బడోస్, సెర్బియా, ఖతార్, ఇరాన్.. ఇలా మొత్తం 11 దేశాలు వీసా-ఫ్రీ అవకాశాన్ని కల్పించాయి. ఇక ఇండొనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, జోర్డాన్, వియత్నాం, టర్కీ, అజర్ బైజాన్, శ్రీలంక, న్యూజిలాండ్, కంబోడియా, మయన్మార్ దేశాలు వీసా రూల్స్ ని సడలించాయి. ఇలా మొత్తం 23 దేశాలకు వీసా కష్టాలు లేకుండానే భారతీయులు వెళ్లే అవకాశం ఏర్పడింది.

మన టూరిస్టులదే హవా
మన దేశం నుంచి 2011లో 1.4 కోట్ల మంది విదేశాలకు వెళ్తే 2019 నాటికి అది 2.7 కోట్లకు చేరుకుంది. కొవిడ్ వల్ల రెండేళ్లపాటు పూర్తిగా పర్యాటకం నిలిచిపోగా, మళ్లీ 2022లో 2.1 కోట్ల మంది పర్యటనలకు వెళ్లారు. గతేడాది UAEకి 28%తో 59 లక్షల మంది, సౌదీ అరేబియాకు 11.5%తో 24 లక్షలు, అమెరికాకు 8%తో 17 లక్షలు, సింగపూర్ కు 4.7%తో 9.9 లక్షలు, థాయిలాండ్ కు 4.4%తో 9.3 లక్షలు, ఇంగ్లండ్ కు 4.3%తో 9.2 లక్షలు, ఖతార్ కు 4.1%తో 8.7 లక్షలు, కువైట్ కు 3.9%తో 8.3 లక్షలు, కెనడాకు 3.6%తో 7.7 లక్షలు, ఒమన్ కు 3.4%తో 7.2 లక్షల మంది టూరిస్టులు వెళ్లినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.