మన దేశ టూరిస్టుల్ని ఆకర్షించేందుకు వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. భారతీయ సందర్శకుల(Visiters) నుంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా దారులు బార్లా తెరుస్తున్నాయి. ఇప్పటికే వీసా లేకుండా తమ దేశం రావచ్చని శ్రీలంక ప్రకటించగా… ఇప్పుడు అదే బాటను థాయిలాండ్ ఎంచుకుంది. ఈ నవంబరు 10 నుంచి భారతీయులు వీసా అవసరం లేకుండానే థాయిలాండ్ ను సందర్శించవచ్చు. ఇది ఆరు నెలలు 2024 మే 10 వరకు అమలులో ఉంటుంది. సందర్శనీయ స్థలాలు(Visiting Places) చూసేందుకు పెద్ద సంఖ్యలో భారతీయులు ఏటా బ్యాంకాక్ సందర్శిస్తుంటారు. కానీ కరోనా ప్రభావంతో ఇంచుమించుగా గత మూడేళ్ల నుంచి ఆయా దేశాల ఆదాయం బాగా పడిపోయింది. శ్రీలంక, థాయిలాండ్, ఇండొనేషియా వంటి దేశాలు పర్యాటకుల రాక తగ్గి కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ టూరిస్టుల్ని ఆకర్షించేందుకు వీసా ఫ్రీ(Visa-Free) సిస్టమ్ ను ప్రకటిస్తున్నాయి.
నాలుగో పెద్ద మార్కెట్ థాయిలాండ్
ఈ సెప్టెంబరు నుంచి చైనాకు వీసా ఫ్రీ ప్రకటించిన థాయిలాండ్.. ఇప్పుడు భారత్, తైవాన్ లను జత చేసింది. ఏటా భారత్ నుంచి 12 లక్షల మంది థాయిలాండ్ లో పర్యటిస్తుండగా.. మలేషియా, చైనా, దక్షిణకొరియా తర్వాత అత్యధిక టూరిస్టులు విజిట్ చేసే దేశంగా ఆ దేశం నిలుస్తున్నది. ఇటీవలే శ్రీలంక సైతం భారత్, చైనా, రష్యా సహా 7 దేశాలకు వీసా ఫ్రీని ప్రకటించింది. మన దేశం నుంచి 2011లో 1.4 కోట్ల మంది విదేశాలకు వెళ్లగా 2019 నాటికి అది 2.7 కోట్లకు చేరుకుంది. కొవిడ్ వల్ల రెండేళ్లపాటు పూర్తిగా నిలిచిపోగా, మళ్లీ 2022లో 2.1 కోట్ల మంది టూరిస్టులు పర్యటించారు. గతేడాది UAEకి 28%తో 59 లక్షల మంది, సౌదీ అరేబియాకు 11.5%తో 24 లక్షలు, USAకు 8%తో 17 లక్షలు, సింగపూర్ కు 4.7%తో 9.9 లక్షలు, థాయిలాండ్ కు 4.4%తో 9.3 లక్షలు, UKకు 4.3%తో 9.2 లక్షలు, ఖతార్ కు 4.1%తో 8.7 లక్షలు, కువైట్ కు 3.9%తో 8.3 లక్షలు, కెనడాకు 3.6%తో 7.7 లక్షలు, ఒమన్ కు 3.4%తో 7.2 లక్షల మంది వెళ్లినట్లు భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.