హమాస్ తీవ్రవాదులు(Hamas Militants) సాగించిన నరమేథంతో ఇజ్రాయెల్(Israel) మారణహోమం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ పై జరిగిన దాడుల్లో 300 మంది దాకా ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో గాయపడ్డారు. అటు హమాస్ తలదాచుకున్న పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ చేస్తున్న రాకెట్ల దాడుల్లోనూ భారీగా ప్రాణనష్టం సంభవించింది. అటువైపూ 400 మందికి పైగా మృత్యువాత పడితే 2,000 మంది దాకా గాయాల పాలయ్యారు. ఈ రెండు దేశాల్లోనూ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ‘ఆపరేషన్ -అల్-అక్సా ఫ్లడ్’ పేరిట ఇజ్రాయెల్ పై 5,000 రాకెట్లు ప్రయోగించడంతోపాటు హమాస్ మిలిటెంట్లు చొరబడి నరమేథం సృష్టించారు. పలువురు సైనికులను కిడ్నాప్ చేసి నానా హంగామా చేశారు. ఊహించని పరిణామంతో తేరుకున్న నెతన్యాహు సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. హమాస్ స్థావరాలే లక్ష్యంతో రాకెట్ల దాడిని ప్రారంభించింది. ఈ పరస్పర దాడులు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన అంతటా కనిపిస్తున్నది.
భయం భయంగా భారతీయ విద్యార్థులు
ఇజ్రాయెల్ లో ఉంటున్న భారతీయ విద్యార్థులు భయం భయంగా కాలం గడుపుతున్నారు. రాకెట్ల దాడులు, కాల్పుల మోతలు, రణరంగంతో ఎప్పుడేమవుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం(Embassy) స్టూడెంట్స్ తో సంప్రదింపులు జరుపుతున్నది. జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తూనే, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే టెల్ అవీవ్ కు ఎయిరిండియా విమానాలు రద్దు చేయగా.. ఇజ్రాయెల్ పరిస్థితులపై విదేశాంగశాఖ దృష్టిసారించింది.