
అటవీప్రాంతంలో రేగిన అగ్ని కీలలు అమెరికాలో అపార ప్రాణ నష్టాన్ని కలిగించాయి. హవాయిలోని మావీ ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చుతో 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండగా… పెద్దసంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. లహైనా రిసార్ట్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో పొగ పీల్చుకుని భారీయెత్తున అస్వస్థతకు గురయ్యారు. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రజల్ని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించింది. ప్రస్తుతానికి వేలాది మందిని తరలిస్తున్నట్లు అక్కడి గవర్నర్ జోష్ గ్రీన్ ప్రకటించారు. ఇప్పటివరకు 11,000 మందిని సేఫెస్ట్ ప్లేసెస్ కు తరలించగా ఇంకా చాలా మందిని బయటకు తీసుకు వస్తున్నామన్నారు.
అమెరికాకు పశ్చిమాన గల మావీ ద్వీపం టూరిజానికి ప్రసిద్ధి. ఇక్కడకు ప్రతి సంవత్సరం 20 లక్షల మంది వస్తుంటారు. మంటల ధాటికి 271 పురాతన కట్టడాలు దెబ్బతిన్నాయని, వేలాది ఇళ్లు ప్రమాదంలో పడ్డాయన్న గవర్నర్.. లహైనాను మళ్లీ మొదటి నుంచి రిపేర్ చేయాల్సి ఉందని తెలిపారు. అటు హవాయి ద్వీపంలో చోటుచేసుకున్న ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన US అధ్యక్షుడు జో బైడెన్.. సహాయ చర్యలు చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించారు. దీన్ని భారీ విపత్తుగా ప్రకటించిన ఆయన.. హవాయి ద్వీప పునర్నిర్మాణానికి సహకరించాలని కార్పొరేట్లను కోరారు.