ఎన్ని పడితే అన్ని సిమ్ కార్డులు(SIM Cards) తీసుకోవడం, వాటిని వాడినంత సేపు వాడేసి మూలన పడేయడం కామన్ గా మారిపోయింది. ఇలా విచ్చలవిడి సిమ్ కార్డుల వల్ల దేశ భద్రతే ప్రమాదంలో పడుతున్నది. గతంలో సిమ్ కార్డులు పొందాలంటే డబ్బు(Charges) చెల్లించాల్సి వచ్చేది. కానీ టెలికాం కంపెనీ(Telecom Operators)ల మధ్య విపరీతమైన పోటీతో రానురాను ఇది ఫ్రీగా మారిపోయింది.
కానీ రానున్న రోజుల్లో మీరు సిమ్ కార్డు, ల్యాండ్ లైన్ నంబరు ఏది తీసుకున్నా ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. సహజవనరుల్లా(Natural Resources)గే మొబైల్ నంబర్లను చాలా విలువైన వస్తువుగా ట్రాయ్(TRAI) భావిస్తున్నది. భవిష్యత్తులో ఫోన్, ల్యాండ్ లైన్ నంబర్లకు రుసుములు వసూలు చేయాలని టెలికాం నియంత్రణ సంస్థ ఆలోచనతో ఉంది.
తొలుత మొబైల్ ఆపరేటర్ల నుంచి ఛార్జీల్ని వసూలు చేయడం, ఆ తర్వాత కస్టమర్లు తీసుకునే నంబర్లను బట్టి ఆదాయం తిరిగి పొందడం జరగొచ్చు. జూన్ 6న విడుదల చేసిన వివరాల్లో ఈ ప్రతిపాదనను ట్రాయ్ పొందుపరిచింది.