చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్(IPL) 17వ సీజన్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టునే విజయం వరించింది. టాస్(Toss) గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. టాప్ ఆర్డర్ తడబడ్డ వేళ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆ టీమ్.. 78కి చేరుకునేసరికి ఐదు వికెట్లు చేజార్చుకుంది. మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై మొదట్నుంచీ గెలుపు దిశగానే సాగింది. IPLలో అడుగుపెడుతూనే బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4 వికెట్లతో విజృంభించడంతో RCB కోలుకోలేకపోయింది. 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 రన్స్ చేసి 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది.
ఆర్సీబీ ఇలా…
ఓపెనర్లు కోహ్లి(21; 20 బంతుల్లో 1×6), డుప్లెసిస్(35; 23 బంతుల్లో 8×4) బాగా ఆడుతున్నట్లు కనిపించారు. చాహర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డుప్లెసిస్ నాలుగు ఫోర్లు బాదాడు. డుప్లెసిస్ వెనుదిరిగాక పటీదార్(0), మాక్స్ వెల్(0) ఖాతా తెరవకుండానే అవుటయ్యారు. ఆ వెంటనే గ్రీన్(18) సైతం ముస్తాఫిజుర్ సూపర్ బాల్ కు బౌల్డయ్యాడు. ఐదు వికెట్లు పడ్డ టీమ్ ను అనూజ్ రావత్-దినేశ్ కార్తీక్ జోడీ ఆదుకుంది. ఉత్తరాఖండ్ కుర్ర వికెట్ కీపర్ అనూజ్(48; 25 బంతుల్లో 4×4, 3×6), దినేశ్(38 నాటౌట్; 26 బంతుల్లో 3×4, 2×6) బాగా ఆడటంతో మెరుగైన స్కోరు చేసింది బెంగళూరు.
ఆది నుంచి బాదుడే…
174 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నైకి శుభారంభం లభించింది. కెప్టెన్ గైక్వాడ్(15) ఔటైనా మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(37; 15 బంతుల్లో 3×4, 3×6) హోరెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన రహానె(27; 19 బంతుల్లో), మిచెల్(22; 18 బంతుల్లో) త్వరగానే పెవిలియన్ దారి పట్టారు. చివర్లో శివమ్ దూబె(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) జోడీ పట్టుదలగా ఆడటంతో తొలి విజయాన్ని CSK నమోదు చేసింది.