కొత్త సంవత్సర ఆరంభాన అయోధ్య(Ayodhya) రామాలయ ప్రారంభోత్సవం కోసం దేశ, విదేశాల్లోని భారతీయులంతా(Indians) ఆసక్తిగా ఎదురుచూశారు. యూపీలోని యోగి సర్కారు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వేడుకను నిర్వహించింది. ఆకాశమంత పందిరి, భూదేవంత లోగిలి అన్న తీరుగా బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠ కోసం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రచారంతో భారత హిందూ ధర్మాన్ని చాటితే మరోవైపు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పొరుగు దేశాలు గట్టిగా ప్రయత్నించాయి. కానీ ముందుగానే నిఘా పెట్టిన టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ.. ఆ కుటిల యత్నాల(Cunning Attempts)ను తిప్పికొట్టింది.
జనవరిలో అసలేం జరిగిందంటే…
జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవమని అంతకు కొద్ది నెలల క్రితమే రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. దీంతో రామాలయ వేడుకలపై చైనా, పాక్ దేశాలకు చెందిన సైబర్ అటాకర్స్ దృష్టిపెట్టారు. రామాలయానికి సంబంధించినవే కాకుండా దేశంలోని కీలక వెబ్ సైట్లపై దాడి చేసేందుకు హ్యాకర్స్(Hackers)తోపాటు సైబర్ క్రిమినల్స్(Cyber Criminals) తీవ్రంగా ప్రయత్నించారు. రామ మందిరం, ప్రసారభారతి, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అధికార వెబ్ సైట్లపై దాడికి దిగారు.
ముందస్తు ‘అలర్ట్’తో…
ఇదంతా జరుగుతుందని భారత నిఘా వర్గాలు ముందే గమనించాయి. దీంతో రామాలయం, ప్రసారభారతి, UP పోలీస్, టూరిజం, UP ఎయిర్ పోర్ట్, పవర్ గ్రిడ్ తోపాటు దేశానికి చెందిన 264 వెబ్ సైట్లను మన టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్(TSOC) మానిటరింగ్ చేసింది. జనవరి 21న రామ మందిరం, ప్రసార భారతిపై 140 I.P. అడ్రస్ ల నుంచి దాడులు జరిగినట్లు గుర్తించింది. కానీ ఈ ఐపీ అడ్రస్ ల్ని ఎక్కడికక్కడ TSOC బ్లాక్ చేసేసింది. ఇలా జనవరి మొత్తంలో చైనా, పాక్ దేశాలకు చెందిన సైబర్ అటాకర్లకు చెందిన 1,244 I.P. అడ్రస్ లను బ్లాక్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే చైనా, పాక్ లే కాదు.. భారత్ లోని కొన్ని I.P. అడ్రస్ ల నుంచి కూడా సైబర్ అటాక్ యత్నాలు జరిగాయని మన నిఘా వ్యవస్థలు గుర్తించాయి.
టెలీకమ్యూనికేషన్ తో…
రామాలయ ప్రారంభోత్సవం కన్నా ముందుగానే మనం జీ-20 సదస్సును నిర్వహించాం. ప్రపంచ దేశాల అధ్యక్షులంతా కొలువుదీరడంతో అందుకు గాను మన టెలీకమ్యూనికేషన్ వ్యవస్థను అత్యాధునికం(Modernisation) చేసుకోవాల్సి వచ్చింది. డిజిటల్ సదుపాయాలు(Infrastructures)ను భారీగా పెంచుకోవడం వల్ల అయోధ్యపై సైబర్ దాడుల్ని సులువుగా తిప్పికొట్టగలిగే అవకాశం ఏర్పడిందని నిఘా వర్గాలు తెలియజేశాయి.