ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) తీరును నిరసిస్తూ ఫిర్యాదు చేసింది IT యూనియన్. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ NITES(నెసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్).. కేంద్ర కార్మిక శాఖను కోరింది. అక్రమంగా, అనైతికంగా ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తూ లేబర్ చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ ఫిర్యాదులో తెలిపింది. ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో మూడు సార్లు ఫెయిలయ్యారంటూ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. దీనిపై NITES ప్రెసిడెంట్ హర్ ప్రీత్ సింగ్ సెల్యూజా.. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయకు లెటర్ రాశారు.
అందులో ఏముందంటే…
‘ఇన్ఫోసిస్ లిమిటెడ్ బలవంతంగా ఉద్యోగుల్ని టెర్మినెట్ చేస్తోంది.. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో తీసుకున్నవారిని అకారణంగా బయటకు పంపుతోంది.. వారికి ఆఫర్ లెటర్ ఇచ్చాక రెండేళ్లకు ఉద్యోగంలోకి తీసుకుని ఆలస్యం చేయడం ఒక కారణమైతే, ఇప్పుడు ఉన్నట్టుండి తొలగించడం బాధాకరం.. రెండున్నరేళ్ల క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చి గత అక్టోబరులో తీసుకున్న 700 మంది ట్రెయినీల్ని తొలగించారు.. 1947 పారిశ్రామిక వివాదాల చట్టాన్ని ఉల్లంఘించిన ఇన్ఫోసిస్ పై చర్యలు తీసుకోవాలి.. ఆ సంస్థపై దర్యాప్తు నిర్వహించాలి.. అప్పటివరకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ఆపాలి.. ఇప్పటికే తీసివేసిన ఉద్యోగుల్ని మళ్లీ రప్పించాలి..’ అన్నది కంప్లయింట్ సారాంశం.