సైబర్ నేరగాళ్ల దాడులు(Cyber Attackers) రోజురోజుకూ పెరిగిపోతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తల(Precautions)ను మరింత పెంచాల్సి వస్తున్నది. ఇప్పటికే ప్రజల వ్యక్తిగత ఫోన్లు, అకౌంట్లపై దాడులు చేస్తూ సొమ్మంతా దోచుకుంటున్న సైబర్ కేటుగాళ్లు… ఇప్పుడు ఎన్నికల వ్యవస్థపైనా కన్నేశారు. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో(Elections Countries) జరగనున్న ఎన్నికలు.. దీని బారిన పడే ప్రమాదముందని ప్రైవేటు ఏజెన్సీలు వార్నింగ్ ఇస్తున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో…
ఆధునిక పద్ధతుల ద్వారా పుట్టుకొస్తున్న కొత్త కొత్త విధానాల ద్వారానే సైబర్ నేరగాళ్లు దాడులకు వ్యూహ రచన చేస్తున్నారు. కృత్రిమ మేధ(Artificial Intelligence) అన్ని వ్యవస్థల్లోనూ పాతుకుపోయి మానవ అవసరం లేకుండా పనులు చక్కబెడుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి AIల ద్వారా నకిలీ డీప్ ఫేక్ లు సృష్టించి ఎన్నికల ప్రక్రియకు అంతరాయం(Interruption) కలిగించవచ్చని గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన ‘క్విక్ హీల్’
తన సెక్రైట్ రిపోర్ట్ లో హెచ్చరించింది.
ఏం చేస్తుంది…
డీప్ ఫేక్ లు సృష్టించి వాటిని వ్యాప్తి చేయడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం, నిఘా వ్యవస్థల(Intelligence Systems)పై దాడి చేసి యంత్రాంగాలను స్తంభింపజేయడం, డీప్ ఫేక్ లతోపాటు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఫెటీగ్ అటాక్ లు, ఎన్నికల వ్యవస్థలోకి ర్యాంసంవేర్ల(Ramsomeware)ను చొప్పించడం వంటివి చేస్తూ ఎన్నికల వ్యవస్థకు అంతరాయం కలిగించే అవకాశాలున్నట్లు ‘క్విక్ హీల్’ తెలిపింది. ఇందుకు AI, క్వాంటమ్ కంప్యూటింగ్, IoT(Internet Of Things) వంటి లేటెస్ట్ పద్ధతుల్ని వాడే ప్రమాదముందని హెచ్చరించింది.
ఏం చేయాలి…
వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే సైబర్ సెక్యూరిటీలో బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసికట్టుగా పనిచేసుకోవడం కీలకం. సాధారణ డేటా బ్యాకప్ లు, నెట్వర్క్ లోని వివిధ విభాగాలను వేరు(Separate) చేయడం ద్వారా ఈ దాడుల్ని ఎక్కడికక్కడ నిరోధించవచ్చు. మాల్ వేర్స్ సోకిన సిస్టమ్ లను త్వరగా నెట్వర్కింగ్ నుంచి దూరంగా పెట్టగలిగితే దాడుల్ని ఎక్కడికక్కడే అరికట్టవచ్చు.