ఈ నెల 11న ప్రారంభం కాబోతున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి సంబంధించి ఇప్పటికే నిధుల సమీకరణ మొదలైంది. రూ.3,000 కోట్ల రుణం(Loan) తీసుకోవాలంటూ హౌజింగ్ బోర్డు(Housing Board)కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో ఇక లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ఈ ఏడాది నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఐదో గ్యారంటీ అయిన ‘ఇందిరమ్మ పథకం’ ప్రారంభోత్సవానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్నందున దానిపై రెవెన్యూ, హౌజింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రివ్యూ నిర్వహించారు.
వీరి పేరిటే ఇళ్లు…
రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ తోపాటు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు. ఈ నెల 11న ప్రారంభించే ఈ కార్యక్రమం భద్రాచలం రాములోరి సన్నిధిలో జరగనుంది. ఇల్లు లేని వారికి స్థలం.. జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం అందిస్తారు. తొలిదశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు నిర్మించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అయితే ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లను మహిళల పేరు మీదే ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటి యజమాని అయిన మహిళ పేరు మీదే ఉండనుందని క్లారిటీ వచ్చింది.
ఇళ్లు ఏ విధంగా కడతారంటే…
పేదలకు కట్టించే నివాసాలు ఎలా ఉండాలో కూడా ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా కట్టించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక్కో ఇంటిలో హాలు(Hall), బెడ్ రూమ్, వంట గది(Kitchen), స్నానాల గది(Bathroom) తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ పథకం అమలు చేస్తామంటూ డేట్ ప్రకటించినా ఇంతవరకు ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు కాలేదు. కాబట్టి వెంటనే గైడ్ లైన్స్ తయారు చేయాలన్న మంత్రి… ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి ఆహార భద్రత కార్డుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు.