Published 23 Jan 2024
UPI Payments : ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ పేమెంట్లపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. అందరి చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉండటంతో UPI పేమెంట్లు చాలా సులభంగా మారిపోయాయి. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్స్ కూడా అందుబాటులో ఉండటంతో యూపీఐ పేమెంట్లు చేయడం మరింత ఈజీ అయిందనే చెప్పాలి. ప్రతిఒక్కరి స్మార్ట్ఫోన్లలో Google Pay, Paytm, PhonePe లేదా మరేదైనా UPI పేమెంట్ సర్వీసును వినియోగిస్తున్నారు. ఈ పేమెంట్ల యాప్స్ ద్వారా ఆన్లైన్లో డబ్బు పంపుకుంటున్నారు. అయితే, ఈ పేమెంట్ యాప్స్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే పనిచేస్తాయి. ఇంటర్నెట్ లేకుండా లావాదేవీలను జరపడం సాధ్యపడదు.
అత్యవసర సమయాల్లో డబ్బు పంపాలంటే? :
సాధారణంగా, ఇంటర్నెట్ కనెక్షన్ పనిచేయని సందర్భాల్లో UPI పేమెంట్లు మధ్యలోనే ఆగిపోవడం చూస్తుంటాం. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అవును అయితే.. ఇకపై దీనిపై ఆందోళన అక్కర్లేదు. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఈజీగా ఆఫ్లైన్లోనూ యూపీఐ పేమెంట్లు వేగంగా పూర్తి చేయొచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. *99#, USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సర్వీసును వినియోగించడమే.. అత్యవసర సమయాల్లో డబ్బు పంపాల్సి వచ్చినప్పుడు ఈ సర్వీసు మీకు చాలా ప్రయోజనరంగా ఉంటుంది. ఇది డబ్బును పంపమని రిక్వెస్ట్ చేయడంతో పాటు ఇతరులకు పంపడానికి, యూపీఐ పిన్ని మార్చడానికి, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా బ్యాంకు అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
యూపీఐ పేమెంట్ల కోసం *99# సర్వీసు.. :
దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ *99#, USSD బ్యాంకింగ్ ఆధారిత సర్వీసులను అందిస్తుంది. దీనిని 83 ప్రముఖ బ్యాంకులు, 4 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తారు. హిందీ, ఇంగ్లీషుతో సహా 13 విభిన్న భాషలలో యాక్సెస్ చేయవచ్చు. మీరు ఈ సర్వీసును సెటప్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్ UPI పేమెంట్లను ఎలా విజయవంతంగా పూర్తి చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆఫ్‌లైన్ UPI చెల్లింపులను ఇలా సెటప్ చేయండి :
- మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఫీచర్ ఫోన్లో *99# డయల్ చేయండి.
- కానీ, మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ నుంచి మాత్రమేనని కాల్ చేయాలని గుర్తించుకోవాలి.
- ఈ కాల్ చేయడానికి మీరు అదే ఫోన్ నంబర్‌ను ఉపయోగించాలి. లేకపోతే ఈ సర్వీసు పని చేయదు.
- ఆ తర్వాత, మీకు కావలసిన భాషను ఎంచుకుని, మీ బ్యాంక్ పేరును నమోదు చేయండి.
- మీ నంబర్‌కి లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల జాబితా మీకు కనిపిస్తుంది. సరైన ఎంపికను నొక్కడం ద్వారా మీకు కావాల్సిన దాన్ని ఎంచుకోండి.
- ఇప్పుడు, గడువు తేదీ (Expire date)తో పాటు మీ డెబిట్ కార్డ్‌లోని చివరి 6 (XXXXX123456) అంకెలను నమోదు చేయండి.
- మీరు విజయవంతంగా సెటప్ చేసిన తర్వాత తదుపరి దశల్లో వివరించిన విధంగా మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే UPI పేమెంట్లు ఈజీగా చేయవచ్చు.
ఆఫ్‌లైన్‌లో UPI చెల్లింపులు ఇలా చేయండి :
- డబ్బు పంపడానికి మీ ఫోన్లో *99# డయల్ చేసి (1) నమోదు చేయండి.
- మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని డబ్బు పంపాలనుకుంటున్న వ్యక్తి (UPI ID/ ఫోన్ నంబర్/ బ్యాంక్ అకౌంట్ నంబర్)ను నమోదు చేయండి.
- ఆ తర్వాత, మొత్తం మరియు మీ UPI పిన్ను నమోదు చేయండి.
- ఒకసారి పూర్తి అయిన తర్వాత, మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది.
- మీకు ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ.0.50 ఛార్జ్ అవుతుంది.
- ప్రస్తుతం, ఈ యూపీఐ పేమెంట్ సర్వీసుపై ఒక్కో లావాదేవీకి గరిష్ట పరిమితి రూ.5,000గా ఉంది.
ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఆన్లైన్ లావాదేవీలు చేసే అవకాశం లేదన్న ఆందోళన అక్కర్లేదు. ఆఫ్‌లైన్‌లో కూడా ఇలా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. పైన సూచించిన టిప్స్ పాటించడం ద్వారా ఇంటర్నెట్ లేకుండానే సులభంగా లావాదేవీలను పూర్తి చేసెయ్యొచ్చు.