మోడ్రన్ డిజిటల్ యుగం(Digital Era)లో టెక్నాలజీ(Technology)కి పెరుగుతున్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ప్రపంచాన్ని భూతాపానికి గురిచేస్తున్న కాలుష్య పీడను వదిలించుకోవడానికి పెట్రోలు, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాల్ని వదిలిపెట్టాల్సి ఉంది. సరిగ్గా ఇదే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థ క్రమంగా జనాల్లోకి చొచ్చుకుపోతున్నది. విద్యుత్తు ఆధారంగా నడిచే వాహనాల సంఖ్య భారీగా వృద్ధి(Develop) అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
2030 నాటికి…
2030 నాటికి కర్బన ఉద్గారాల్ని 45 శాతానికి తగ్గించాలన్న కేంద్రం లక్ష్యం సాకారమవుతున్నట్లే కనపడుతున్నది. ఇందుకు కారణం విద్యుత్ వాహనాల(Electric Vehicles) గిరాకీ పెద్దయెత్తున పెరగడమే. ప్రభుత్వ వాహన్ వెబ్ సైట్ లో తెలిపిన వివరాల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఏడాది కన్నా 40 శాతానికన్నా ఎక్కువగా వెహికిల్స్ అమ్ముడయ్యాయి. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు దేశవ్యాప్తంగా 16.66 లక్షల వాహనాల విక్రయాలు జరిగాయి.
రోజుకు వేలల్లో…
గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటు(Average)న 4,500 ఈవీల అమ్మకాలు జరిగాయి. అంతకుముందు ఏడాదిలో వీటి సంఖ్య 3,200గా ఉంది. పెట్రోల్, డీజిల్, CNG రేట్లు ఎక్కువగా ఉండటంతో కాస్త ధర ఎక్కువైనా ఎలక్ట్రిక్ వెహికిలే కొనుక్కుందామన్న ఆలోచన ప్రజల్లో కనపడుతున్నది. ఒక్కసారి కొంటే ఇక ఇంధనం రూపేణా డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి లేకపోవడం, మరోవైపు పర్యావరణానికి కూడా మంచిది అన్న ఉద్దేశం కూడా చాలా మందిలో ఉంది.
బైక్స్ భారీగా…
అమ్ముడుపోయిన వాటిలో బైక్స్ శాతం 56 కాగా, 2022-23లో ఇది 29%గానే ఉంది. ఇక మూడు చక్రాల వెహికిల్స్ 38% కాగా ఈ రెండు రకాల విక్రయాలే 94%గా ఉండటం విశేషం. కార్లు, SUVల విక్రయాలు సైతం భారీగా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్(EMPS) కింద సబ్సిడీల కోసం రూ.500 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు ఈ బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించడం కూడా వీటి వృద్ధికి కారణమవుతున్నది.
నాలుగు నెలలకు స్కీమ్…
ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ నిధులతో 3.72 లక్షల ఈవీల కొనుగోళ్లను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. బైక్ లకు రూ.10.000… e-రిక్షాలు, e-కార్ట్ లకు రూ.25,000… త్రిచక్ర వాహనాలకు రూ.50,000 దాకా ప్రోత్సాహం దక్కనుంది. ఛార్జింగ్ యూనిట్లు, విడిభాగాలు, అసెంబ్లింగ్ యూనిట్ల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల ఈవీలకు భారతదేశంలో డిమాండ్ భారీయెత్తున పెరుగుతున్నది.