అమ్మో ఒకటో తారీఖు(Date) జీతాలా(Salaries)… అది మరచిపోయింది చాలా కాలమైందిలే… ఒకటో తారీఖు పక్కన పెట్టు… కొన్ని జిల్లాల్లోనైతే 10, 15 తేదీలకు కూడా అందుకోవాల్సి వస్తుంది.. అంటూ ఉద్యోగులు నిరాశ, అసంతృప్తిలో ఉండేవారు. గత రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినా.. రాష్ట్రమంతా ఒకే రోజు జీతాలిచ్చే వాతావరణం కూడా లేకుండా పోయింది. కానీ తాము అధికారంలోకి వస్తే మళ్లీ మొదటి తేదీ నాడే జీతాలిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఫస్ట్ తారీఖు నాడే…
ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం.. ఫిబ్రవరి జీతాన్ని మార్చి 1నే ఉద్యోగులకు అందజేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంది. 2022-23, 2023-24 సంవత్సరాల్లో తొలిసారి ఈ నెల 1 నాడు జీతాలిచ్చారు. 2022 జులైలో 14న, 2023 డిసెంబరులో 15న చెల్లించారు. కానీ గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి అని కొన్ని ఉద్యోగ సంఘాలు(Employees Unions) అంటున్నాయి.
గత ప్రభుత్వంలో…
ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న విమర్శలు, ఒత్తిళ్లలకు స్పందించిన KCR ప్రభుత్వం… ఎన్నికలకు ముందు 2023 అక్టోబరులో 1 నాడు జీతాలు ఇవ్వగలిగింది. కానీ అది అందరికీ అందకపోవడంతో అప్పుడూ పూర్తిస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరికీ ఫస్ట్ డేట్ నాడు ఒకేసారి జీతాలు అందడం మాత్రం రెండేళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషంగా నిలిచింది.
ఉద్యోగ సంఘాల సంతోషం…
ఈ పరిణామంపై ఉద్యోగ సంఘాల్లో సంతోషం కనపడుతున్నది. చాలా సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి చూస్తున్నామని UTF అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని, ఇదే ఒరవడిని కొనసాగించాలని కోరారు. ట్రెజరీల్లో ఆమోదం పొంది రెండేళ్లుగా సర్కారు వద్ద పెండింగ్ లో ఉన్న GPF, TSGLI, PRC బకాయిలు, మెడికల్ రీఎంబర్స్ మెంట్, పెన్షన్ తదితర బిల్లులన్నీ వెంటనే క్లియర్ చేయాలని జంగయ్య, చావ రవి విజ్ఞప్తి చేశారు.