బాబోయ్.. అంత జీతమా? వేరే కంపెనీలోకి వెళ్లొద్దని ఉద్యోగికి 300 శాతం జీతం పెంచిన గూగుల్..
Google Salary Hike : ఒక ఉద్యోగికి 300 శాతం జీతం పెంపు? మీరు ఊహించగలరా? అవును, మీరు చదివింది నిజమే.. ఎక్కడో కాదు.. సెర్చ్ దిగ్గజం గూగుల్ కంపెనీలో.. ఒక్క మాటలో చెప్పాలంటే.. గూగుల్ వంటి కంపెనీలకు ఇది సాధ్యమే. సాధారణంగా ఒక కంపెనీలో ఉద్యోగికి 50 శాతం పెంపు గురించి వినొచ్చు.. లేదంటే దాని కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అంతేకానీ 300 శాతం జీతం పెంచడమంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద జీతమిచ్చి ఆ ఉద్యోగిని పోకుండా ఆపిందంటే.. గూగుల్‌కి ఆ ఉద్యోగి ఎంత ముఖ్యమో తెలుస్తోంది. అలెక్స్ కాంట్రోవిట్జ్ నిర్వహించిన బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్ షోలో ఈ నియామకం గురించి అమెరికా ఆధారిత (Perplexity AI) స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ వెల్లడించారు.
గూగుల్ ఉద్యోగికి ఏఐ కంపెనీలో ఆఫర్..
ఐఐటీ మద్రాస్‌కి చెందిన శ్రీనివాస్ ఇటీవల (Perplexity AI) స్టార్టప్ కోసం గూగుల్ ఉద్యోగిని నియమించుకోవడానికి ప్రయత్నించారు. ఈ కంపెనీతో మాట్లాడిన తర్వాత ఆ ఉద్యోగి తన యజమానిని సంప్రదించి కొత్త జాబ్ ఆఫర్ వచ్చినట్టు తెలిపాడు. కానీ, ఆశ్చర్యకరంగా, గూగుల్ ఆ ఉద్యోగికి కళ్లుచెదిరే ఆఫర్ ఇచ్చింది. ఇప్పటికే టెక్ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగుల తొలగిస్తోంది. ఈ తొలగింపుల మధ్య గూగుల్ ఒక ఉద్యోగికి నాలుగు రెట్లు (ప్రాథమికంగా 300 శాతం) జీతం పెంచడం నిజంగా షాకింగ్ నిర్ణయమేనని చెప్పవచ్చు. గూగుల్ అందించిన ఆఫర్‌తో ఉద్యోగికి నోటివెంట మాట రాలేదు. గూగుల్ జీతం 300 శాతం పెంపుదలకు అంగీకరించాడని శ్రీనివాస్ వెల్లడించారు.
మరోవైపు గూగుల్ వర్క్‌ఫోర్స్ తగ్గించుకునేందుకు వరుసబెట్టి ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని గూగుల్ కంపెనీల్లో గత ఏడాది నుంచి చాలా మంది ఉద్యోగుల(Employees)ను తొలగిస్తోంది. గత 1.5 నెలలుగా కంపెనీ అసిస్టెంట్, హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్‌తో సహా వివిధ విభాగాలలో ఉద్యోగులను తొలగించింది.