ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక్క విజయాన్నీ అందుకోలేక పాయింట్ల టేబుల్ లో చివరి స్థానం(Last Place)లో ఉన్న గుజరాత్ జెయింట్స్… మహిళల ప్రీమియర్ లీగ్ లో బోణీ కొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ టీమ్.. ఇప్పటిదాకా వచ్చిన పరాజయాల(Losses) పరంపర వల్ల పడ్డ కసినంతా చూపించింది. ఓపెనర్లు లారా వొల్వార్త్, కెప్టెన్ బెత్ మూనీ విజృంభించడంతో తొలుత 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరును 8 వికెట్లకు 180 వద్ద కట్టడి చేసి 19 రన్స్ తేడాతో గెలుపొందింది. మొత్తానికి తన ఐదో మ్యాచ్ లో మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఓపెనర్ల వీరబాదుడు…
వొల్వార్త్(76; 45 బంతుల్లో 13×4), మూనీ(85; 51 బంతుల్లో 12×4, 1×6) జంట వీరబాదుడుతో తొలి ఓవర్ నుంచే గుజరాత్ రన్ రేట్ 10కి పైగా నడిచింది. ఈ ఇద్దరు మినహా మిగతావారెవరూ పెద్దగా ఆడలేకపోయారు. ఫస్ట్ వికెట్ కు ఈ జోడీ 140 రన్స్ పార్ట్నర్ షిప్ ఇచ్చింది. తర్వాత వచ్చిన లిచ్ ఫీల్డ్(18), ఆష్లే గార్నర్(0), హేమలత(1), వేద కృష్ణమూర్తి(1) టపటపా వికెట్లు కోల్పోవడంతో మరింత ఎక్కువ స్కోరు చేయాల్సిన గుజరాత్ 199కే పరిమితమైంది.
48 హయ్యెస్ట్…
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బేజారైంది. అత్యంత తక్కువ స్కోరుకే ప్రధాన వికెట్లను కోల్పోయింది. సబ్బినేని మేఘన(4), స్మృతి మంధాన(24), ఎలిసె పెర్రీ(24), సోఫీ డివైన్(23) పెద్దగా క్రీజులో నిలబడలేదు. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్(30), జార్జియా వేరమ్(48) కొద్దిసేపు ఫర్వాలేదనిపించినా అప్పటికే చేయాల్సిన రన్ రేట్ 14కు చేరుకుంది. ఈ ఇద్దరితోపాటు చివర్లో మొత్తం నాలుగు వికెట్లు కోల్పోవడంతో బెంగళూరు పరాజయం ఖాయమైపోయింది.