మనం వాడుతున్న ప్రతి టెక్నాలజీ వెనుక శాటిలైట్లదే పాత్ర. ఈ ఉపగ్రహాలు(Satellites) అంతరిక్షంలో తిరుగుతుంటేనే మన పని నడిచేది. ఇంటర్నెట్ నుంచి GPS(Global Positioning System) దాకా ప్రతిదానికీ శాటిలైట్లపైనే ఆధారపడుతూ ఉన్నాం. వాతావరణ మార్పులు, ఉత్పాతాలు, వనరుల అన్వేషణ సహా నిత్య జీవితం నుంచి పరిశోధనల దాకా అన్నింటికీ ఈ ఉపగ్రహ వ్యవస్థే ప్రామాణికం.
అందుకే ఇప్పుడు అన్ని దేశాలు అంతరిక్ష(Space) రంగంపైనే దృష్టి పెట్టి భారీ సంఖ్యలో రాకెట్లను నింగిలోకి పంపుతున్నాయి. అయితే భూమి చుట్టూ ఎన్ని శాటిలైట్లు తిరుగుతున్నాయి.. అవి ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయనే దానిపై ఐక్యరాజ్యసమితి ‘ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్’ ఒక నివేదిక రూపొందించింది. ఆ వివరాలు…
జూన్ 11 నాటికి…
2024 జూన్ 11 నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు మూడు కక్ష్యల్లో తిరుగుతున్నాయి. ఆ 3 కక్ష్యలే జియో స్టేషనరీ ఆర్బిట్(GSO), మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO), లో-ఎర్త్ ఆర్బిట్(LEO). ఇందులో GEO కక్ష్యలోకి పంపడానికి భారీ రాకెట్లు కావాల్సి ఉండగా, ఖర్చు ఎక్కువ. అందుకే ఆ ప్రాంతంలో శాటిలైట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
జీఈవో…
భూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్య ఇది. భూభ్రమణానికి సరిపడే వేగంతో శాటిలైట్లు సంచరించేందుకు అనువైన ప్రాంతమిది. GEOలో తిరిగేవి భూమిపై ఒకే ప్రాంతం మీద ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లను ఈ ఆర్బిట్లో ఉంచుతారు.
ఎంఈవో…
భూమికి 2,000 నుంచి 30 వేల కిలోమీటర్ల మధ్యన గల ప్రాంతమే మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO). జీపీఎస్, గ్లోనాస్ వంటి నావిగేషన్, రక్షణ రంగ శాటిలైట్లు ఇక్కడ తిరుగుతాయి.
ఎల్ఈవో…
పుడమికి కేవలం 150 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల మధ్యన ఉండేదే లో-ఎర్త్ ఆర్బిట్(LEO). ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ ప్రాంతంలో తిరిగేలా ప్రయోగిస్తారు.
ప్రస్తుతమున్న శాటిలైట్లలో అత్యధికం స్టార్ లింక్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవే. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్ లింక్ కోసం 6,050 శాటిలైట్లు పంపించింది. ఇవన్నీ గత ఐదేళ్లలో అంతరిక్షంలోకి పంపినవి కాగా.. త్వరలో మరో 6 వేల శాటిలైట్లు పంపేందుకు ఆ సంస్థ రెడీగా ఉంది.