జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇంకా ప్రయోగదశలోనే ఉన్న హైపర్ సోనిక్(Hypersonic Missile) పరీక్షల విషయంలో వాటి కంటే భారత్ ఎంతో ముందడుగేసింది. ఈ తరహా క్షిపణిని విజయవంతంగా పరీక్షించి అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది. ధ్వని వేగానికి 5 రెట్లు అధికంగా ప్రయాణించగలిగే లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ మిస్సైల్.. గంటకు 6,200 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్తుంది. శత్రు దేశాల రాడార్లు, గగనతల వ్యవస్థలకు దొరక్కుండా అవి పసిగట్టే లోపే లక్ష్యాన్ని పూర్తి చేయగలిగే సామర్థ్యం దీని సొంతం.
ఖండాతర క్షిపణుల్ని శత్రు దేశాలు ట్రాక్ చేయడం తేలిక(Easy) కాగా.. ఈ హైపర్ సోనిక్ ను మాత్రం గుర్తు పట్టే వీలు కూడా ఉండదు. ప్రస్తుతం మన దేశం ప్రయోగించిన ఈ మిస్సైల్ 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒడిశాలోని డా. APJ అబ్దుల్ కలాం ఐలాండ్ లో.. పూర్తి కచ్చితత్వంతో టార్గెట్ ను రీచ్ అయినట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. DRDO ఆధ్వర్యంలో హైదరాబాద్ లోనే ఈ మిస్సైల్ తయారైంది.